ఉప రాష్ట్రపతి ఎన్నికకు సంబంధించిన షెడ్యూల్ ను కేంద్ర ఎన్నికల సంఘం రిలీజ్ చేసింది. జూలై 5 న నోటిఫికేషన్ రిలీజ్ చేస్తామని ప్రకటించింది. ఆ రోజు నుంచి నామినేషన్ల దాఖలు ప్రక్రియ ప్రారంభమవుతుందని పేర్కొంది. ఈ నామినేషన్ల ప్రక్రియ జూలై 19 న ముగుస్తుందని, 20న స్ర్కూటినీ వుంటుందని తెలిపింది. 22 తేదీ వరకూ ఉప సంహరణ చేసుకునే వీలు వుంటుందని ఈసీ తెలిపింది. ఆగస్టు 6న ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకూ పోలింగ్ వుంటుందని, ఆ రోజు సాయంత్రమే ఫలితాలను వెల్లడిస్తామని ఈసీ తెలిపింది.
ఉప రాష్ట్రపతిని పార్లమెంట్ ఉభయ సభ్యులతో వున్న ఎలక్టోరల్ కాలేజీ ఎన్నుకుంటుంది. 233 మంది రాజ్యసభ సభ్యులతో పాటు 12 మంది నామినేటెడ్ సభ్యులు, 543 మంది లోక్ సభ ఎంపీలతో కలుపుకొని మొత్తం 788 మంది ఓటింగ్ లో పాల్గొంటారు. అయితే.. ఇప్పటి వరకూ ఎవరు కూడా తమ ఉప రాష్ట్రపతి అభ్యర్థిని ప్రకటించలేదు. ఎన్డీయే తరపున కేంద్ర మాజీ మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ రేసులో వుంటారన్న వార్త పుకారులో వుంది. బీజేపీ మాత్రం దీనిని ధ్రువీకరించలేదు.