ఢిల్లీ లిక్కర్ స్కాంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఈడీ మళ్లీ నోటీసులు పంపింది. ఈ నెల 20 న కవిత విచారణకు హాజరు కావాలని ఈడీ తన నోటీసుల్లో స్పష్టంగా పేర్కొంది. షెడ్యూల్ ప్రకారం ఢిల్లీ లిక్కర్ స్కాంలో విచారణ నిమిత్తం కవిత నేడే ఈడీ విచారణకు హాజరు కావాల్సి వుంది. కానీ.. చివరి నిమిషంలో అనారోగ్య కారణాలు చూపుతూ ఈడీ విచారణకు గైర్హాజర్ అయ్యారు. తాను విచారణకు హాజరు కాలేనంటూ మెయిల్ పెట్టారు. తన ప్రతినిధిగా బీఆర్ఎస్ నేత, న్యాయవాది సోమా భరత్ ద్వారా ఈడీ అడిగిన పత్రాలను పంపారు. దీంతో ఈడీ తాజాగా మళ్లీ నోటీసులు పంపింది. వ్యక్తిగతంగా ఈ నెల 20 న విచారణకు హాజరవ్వాలని అందులో సూచించింది. మరోవైపు లిక్కర్ స్కాంలో రామచంద్ర పిళ్లైను ఈడీ రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు. కోర్టు.. పిళ్లైకి 3 రోజుల పాటు ఈడీ కస్టడీని పొడిగించింది.
ఢిల్లీ లిక్కర్ స్కాం విచారణలో భాగంగా ఎమ్మెల్సీ కవిత నేటి ఈడీ విచారణకు గైర్హాజర్ అయ్యారు. అనారోగ్య కారణాలతో విచారణకు హాజరుకాలేకపోతున్నానని పేర్కొన్నారు. అయితే… ఈడీ అడిగిన ప్రశ్నలకు తన సమాధానాలను తన ప్రతినిధి, బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి సోమా భరత్ ద్వారా ఈడీ కార్యాలయానికి కవిత పంపారు. కవిత ప్రతినిధి సోమా భరత్ ఈడీ కార్యాలయంలో కొన్ని పత్రాలను సమర్పించారు. సుప్రీం కోర్టులో తన పిటిషన్ పెండింగ్ లో వుందని, కోర్టు నిర్ణయం తర్వాతే విచారణకు హాజరవుతానని ఆ లేఖలో కవిత పేర్కొన్నారు.
ఈడీ విచారణకు ఎమ్మెల్సీ కవిత గైర్హాజర్ కావడంపై ఆమె తరపు న్యాయవాది సోమా భరత్ స్పందించారు. చట్ట ప్రకారం విచారణ జరగట్లేదని, అందుకే గైర్హాజర్ అని వివరించారు. అలాగే అక్రమంగా కవిత ఫోన్‌ను ఈడీ సీజ్ చేసిందన్నారు. ఈడీ విచారణ అంశంపై సుప్రీంకోర్టులో పిటీషన్ వేశామని, ఆ తీర్పుకు అనుగుణంగా తాము నడుచుకుంటామన్నారు. మహిళను ఇంటి వద్దే విచారించాలని, ఆఫీసుకు రావాలని సమన్లు ఇచ్చే పవర్స్ ఈడీకి లేవన్నారు.