శివసేన ఎంపీ సంజయ్ రౌత్ కు ఈడీ మరోసారి షాక్ ఇచ్చింది. ఆదివారం ఉదయం 7 గంటల నుంచే ముంబైలోని ఆయన ఇంట్లో సోదాలు నిర్వహించడం ప్రారంభించింది. పత్రచాల్ భూముల విషయంలో అవకతవకలకు పాల్పడ్డారన్న అభియోగాలు రౌత్ పై వున్నాయి. ఈ క్రమంలోనే దఫదఫాలుగా ఈడీ సోదాలు నిర్వహిస్తోంది. అయితే తాజాగా జరిగిన దాడులు మాత్రం రౌత్ కు ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండానే జరిగాయి.
మనీ లాండరింగ్ కేసులో జూలై 1 న రౌత్ ఈడీ విచారణకు హాజరయ్యారు. జూలై 20 న మరోసారి హాజరు కావాలని ఈడీ సమన్లు జారీ చేసింది. అయితే తాను పార్లమెంట్ సమావేశాల్లో బిజీగా వున్నానని రౌత్ సమాధానమిచ్చారు. మరోవైపు ఈడీ సోదాలు జరుగుతుండటంతో ఆయన ఇంటి ముందు కేంద్ర బలగాలను మోహరించారు. తాను మాత్రం ఈడీ విచారణకు భయపడనని, ఎదుర్కొంటానని రౌత్ ప్రకటించారు.