నేషనల్ హెరాల్డ్ కార్యాలయాన్ని ఈడీ అధికారులు సీజ్ చేశారు. తమ అనుమతి లేకుండా.. కార్యాలయాన్ని ఎట్గి పరిస్థితుల్లోనూ తెరవొద్దని ఈడీ అధికారులు తేల్చి చెప్పారు. దీంతో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలినట్లైంది. మనీలాండరింగ్ కేసులో అటు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఆ పార్టీ ఎంపీ రాహుల్ గాంధీ ఇప్పటికే పలు మార్లు ఈడీ విచారణకు హాజరైన విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ ముఖ్య నేతలు తదుపరి ఏం చేయాలన్న దానిపై కీలక సమావేశం నిర్వహించారు. మరోవైపు కాంగ్రెస్ ముఖ్య కార్యాలయం ముందు భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండానే బందోబస్తు ఏర్పాటు చేశామని పోలీసులు పేర్కొన్నారు.
మరో వైపు నేషనల్ హెరాల్డ్ ప్రధాన కార్యాలయాన్ని ఈడీ సీజ్ చేయడంపై కాంగ్రెస్ ట్వీట్ చేసింది. పోలీసులను మోహరించడం ద్వారా.. సత్యాన్ని దాచిపెట్టలేరు. మేం గాంధీ వారసులం. చీకటిపై యుద్ధం చేస్తాం. పోలీసులను మోహరించడం ద్వారా ఆ నియంత ఎంత భయపడుతున్నారో అర్థమైపోతుంది. అయితే.. నిరుద్యోగం, ద్రవ్యోల్బణం గురించే ఎప్పటికీ అడుగుతుంటాం అంటూ కాంగ్రెస్ ట్వీట్ చేసింది.