ఢిల్లీ మద్యం కేసులో కీలక పరిణామం జరిగింది. ఢిల్లీ మద్యం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు (mlc kavitha) ఈడీ నోటీసులిచ్చింది. గురువారం విచారణకు రావాలని ఆదేశించింది. హైదరాబాద్ వ్యాపారి రామచంద్ర పిళ్లైతో కలిసి, కవితను విచారించనున్నట్లు సమాచారం. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఎమ్మెల్సీ కవితకు ఉచ్చు బిగుస్తోంది. ఈ కుంభకోణంలో కీలక పాత్రధారిగా పేర్కొంటున్న హైదరాబాద్ మద్యం వ్యాపారి అరుణ్ రామచంద్ర పిళ్లైని ఈడీ అరెస్టు చేసింది. ఆయన రిమాండ్ రిపోర్టులో పలుమార్లు కవిత పేరును ప్రస్తావించింది.
అంతేకాకుండా కవిత ప్రతినిధిని తానని ఒప్పుకున్నట్లు ఈడీ వెల్లడించింది.తాను కవితా బినామీనని, ఆమె ప్రతినిధినని రామచంద్ర పిళ్లై ఎన్నోసార్లు పేర్కొన్నారని ఈడీ తన రిమాండ్ రిపోర్టులో పేర్కొంది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఆదేశాల మేరకే తానే పనిచేశానని, ఆమె సూచనల మేరకే పనిచేశానని చెప్పారని ఈడీ తెలిపింది. లిక్కర్ స్కామ్ లో పిళ్లై కీలకపాత్ర పోషించారని, ఇండో స్పిరిట్ స్థాపనలో ఆయనదే కీలక పాత్ర అని ఈడీ పేర్కొంది.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ రోజుకో మలుపు తిరుగుతోంది. అరెస్టుల పర్వమూ కొనసాగుతుండటంతో మరింత ఉఠ్కంతగా ఈ అంశం మారిపోయింది. తాజాగా… బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (MLC kavitha)ప్రతినిధి అరుణ్ రామచంద్ర పిళ్లైని ఈడీ అరెస్ట్ చేసింది. రెండు రోజులుగా ఇదే అంశం విచారించిన తర్వాతే… అరెస్ట్ చేస్తున్నామని ఈడీ ప్రకటించింది. అరెస్ట్ చేసిన తర్వాత పిళ్లైని పోలీసులు ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో హాజరు పరిచారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో మరిన్ని వివరాలు రాబట్టాల్సి వుందని, అందుకే పిళ్లైని తమ కస్టడీకి అప్పజెప్పాలని ఈడీ న్యాయస్థానాన్ని కోరింది.