ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పే చిల్లర మాటలను వినే స్థితిలో లేరని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కౌంటర్ ఇచ్చారు. ప్రజలను మెప్పించి, ఒప్పించే శక్తి సీఎం కేసీఆర్ ఏనాడో కోల్పోయారని ఎద్దేవా చేశారు. మునుగోడులో కేసీఆర్ ను ఎట్గి పరిస్థితుల్లోనూ గెలవనివ్వమని, అన్ని వర్గాల ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా సభ వేదికగా సీఎం కేసీఆర్ కు తప్పకుండా సమాధానం చెప్పి తీరుతామని ఈటల ప్రకటించారు. బావుల దగ్గర మీటర్లు పెట్టాలన్న ఆలోచన బీజేపీకి లేదని, బీజేపీకి ఓటేస్తే మీటర్లు వస్తాయన్నది పచ్చి అబద్ధమని స్పష్టం చేశారు. తామెప్పుడూ ప్రజల పక్షమని సీపీఐ చెప్పుకుంటుందని, తెలంగాణ ప్రజల గోసను ఎప్పుడైనా సీఎంకు తెలిపారా? అంటూ ఈటల సూటిగా ప్రశ్నించారు.
మునుగోడులో జరిగిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రసంగించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీని తీవ్రంగా విమర్శించారు. మోటర్లకు మీటర్లు పెట్టాలనడం వెనుక పెద్ద కుట్ర ఉందని కేసీఆర్ ఆరోపించారు. పేదలను దోచి పెద్దలకు పంచే ప్రయత్నంలో భాగంగానే ఈ కుట్ర జరుగుతోందని అన్నారు. కేసీఆర్ బతికున్నంత వరకు మీటర్లు పెట్టడని సీఎం స్పష్టం చేశారు. బీజేపీ సర్కారు దోపిడీదారులను, బ్యాంకులను వేల కోట్లు ముంచేటోళ్లను బలపరుస్తోందని, మునుగోడు రైతులు ఓటు వేసే ముందు బోరు దగ్గరికి వెళ్లి, దానికి దండం పెట్టాలని అన్నారు.