బీజేపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఈటల రాజేందర్ సంచలన ప్రకటన చేశారు. వచ్చే ఎన్నికల్లో తాను గజ్వేల్ నుంచి సీఎం కేసీఆర్ పై పోటీ చేస్తానని ప్రకటించారు. గజ్వేల్ నుంచి పోటీ చేస్తానని తాను గతంలోనే చెప్పానని, ఇందుకోసం గజ్వేల్ నియోజకవర్గంలో ఇప్పటి నుంచే సీరియస్ గా వర్క్ చేస్తున్నట్లు సంచలన ప్రకటన చేశారు. తాను గజ్వేల్ లోనే టీఆర్ఎస్ లో చేరానని ఈ సందర్భంగా గుర్తు చేశారు.
సీఎం కేసీఆర్ ను అధికారం నుంచి దించాలంటే.. ఈగోలను పక్కన పెట్టి, పోరాడాలని సూచించారు. బెంగాల్ లో మమతను సువేందు అధికారి ఎలాగైతే ఓడించారో.. అలాగే తాను కూడా సీఎం కేసీఆర్ ను ఓడిస్తానని ప్రకటించారు. ప్రశ్నించే తత్వం సహజంగా తెలంగాణ సమాజంలోనే వుందన్నారు. కేసీఆర్ కు వ్యతిరేకంగా ఓటు వేయాలని, అందుకు తెలంగాణ ప్రజలు సిద్ధంగా వుండాలని పిలుపునిచ్చారు. తమ పార్టీకి చెందిన జీహెచ్ ఎంసీ కార్నొరేటర్లను చేర్చుకుంటే తాము చూస్తూ ఊరుకోమని, టీఆర్ఎస్ నుంచి వలసలను ప్రోత్సహిస్తామని ఈటల ప్రకటించారు.