కాళేశ్వరం డిజైన్ విషయంలో ఇంజినీర్లు చెప్పినా సీఎం కేసీఆర్ వినేవారు కాదని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. తానే డిజైనర్, తానే సృష్టికర్త అన్న భ్రమల్లో కేసీఆర్ వుండేవారని ఎద్దేవా చేశారు. ప్రాజెక్టులు కట్టడమే తనతో ప్రారంభమైందని అనుకునే వారని విమర్శించారు. కాళేశ్వరమే జిందాతీలిస్మాత్ అని ప్రభుత్వం చెప్పడం, మిగతా నీటి వనరులు అవసరం లేదని ప్రచారం చేయడం తప్పని ఈటల ఆక్షేపించారు. కాళేశ్వర ప్రాజెక్ట్ లోపాలపై జర్నలిస్ట్ అధ్యయన వేదిక నేడు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించింది.
ఈ కార్య్రక్రమానికి బీజేపీ ఎమ్మెల్యే ఈటల, కాంగ్రెస్ నేత మధుయాష్కీ, తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ…. ప్రభుత్వ ప్రాజెక్టు లోపాల వల్ల ప్రజలు కోట్లాది రూపాయలు నష్టపోతున్నారని, ప్రజలకు భరోసా ఇవ్వాల్సిన బాధ్యత మాత్రం ప్రభుత్వానిదేనని చెప్పారు. ఇన్ని అనుభవాల తర్వాత ప్రాజెక్టుల విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అసలు కాళేశ్వరం ముంపు మానవ తప్పిదమా? ప్రకృతి వైరీత్యమా అని సూటిగా ప్రశ్నించారు.
ఇక… కాంగ్రెస్ నేత మధు యాష్కీ మాట్లాడుతూ.. మేఘాలు బద్దలు కాలేదని, మేఘా అవినీతి బద్దలైందని మండిపడ్డారు. కేసీఆరే ఇంజినీర్, డాక్టర్, మేధావి అని ఎద్దేవా చేశారు. కాళేశ్వరం ముంపు మానవ తప్పిదమే అని అన్నారు. రజత్ కుమార్ ను వెంటనే అరెస్ట్ చేయాలని మధుయాస్కీ డిమాండ్ చేశారు. అలాగే మేఘా అధినేతను కూడా అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. సమైక్యాంధ్ర కంటే ఇప్పుడే దుర్భర పరిస్థితులు వున్నాయని, మనిషి రూపంలో వున్న రాక్షసుడు సీఎం కేసీఆర్ అని మధుయాస్కీ పరుషంగా వ్యాఖ్యానించారు.