మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే సంచలన డిమాండ్ చేశారు. కేంద్ర ఎన్నికల సంఘాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికల సంఘం కమిషనర్లను ప్రజలు ఎన్నుకునే విధానాన్ని ప్రవేశపెట్టాలని సూచించారు. ప్రస్తుత ముఖ్యమంత్రి ఏకనాథ్ షిండే వర్గానికి శివసేన పార్టీ పేరు, గుర్తును కేటాయిస్తూ ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం తీసుకుంది. దీనిపై ఉద్ధవ్ థాకరే సుప్రీంలో పిటిషన్ వేశారు. ఈ నేపథ్యంలోనే ఉద్ధవ్ మీడయా సమావేశం నిర్వహించి, కేంద్రంపై మండిపడ్డారు. తమ విషయంలో ఇంత తొందరగా, హడావుడిగా నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఏముందని సూటిగా ప్రశ్నించారు.
శివసేన సస్పెండ్ చేసిన ఎమ్మెల్యేల వ్యవహారం సుప్రీంలో వున్నందున, పార్టీ పేరు, గుర్తు కేటాయింపుపై ఇప్పుడే నిర్ణయం తీసుకోవద్దని గతంలోనే తాము ఎన్నికల సంఘాన్ని కోరామని గుర్తు చేశారు. అయినా హడావుడిగా నిర్ణయం తీసేసుకున్నారని మండిపడ్డారు. శివసేనను అంతమొందించాలన్న బీజేపీ కుట్రలో భాగంగానే తమ నుంచి పార్టీ పేరును, గుర్తును లాక్కొన్నారని ఆరోపించారు. అయితే… తన నుంచి అన్నీ లాక్కొన్నా…. థాకరే అన్న పేరును మాత్రం ఎవ్వరూ లాక్కోలేరని అన్నారు. ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయంపై తాము సుప్రీంను ఆశ్రయించామని, తమ పిటిషన్ పై మంగళవారం విచారణ జరుగుతుందన్నారు. ఈ విషయంలో సుప్రీం కోర్టు ఒక్కటే తమకు ఆశాకిరణమని ప్రకటించారు.
మహారాష్ట్రలోని శివసేన పార్టీ పంచాయతీ సుప్రీంకోర్టుకు చేరింది. విల్లు, బాణం గుర్తును ఏక్ నాథ్ షిండే కు ఈసీ కేటాయించడాన్ని సవాలు చేస్తూ ఉద్ధవ్ ఠాక్రే సుప్రీం కోర్టులో పిటిషన్ వేశారు.అయితే ఈ పిటిషన్ అత్యవసర విచారణకు సుప్రీం నిరాకరించింది. మంగళవారం మళ్ళీ బెంచ్ ముందు ప్రస్తావించాలని సూచించింది.
మరోవైపు శివసేన ఎంపీ సంజయ్ రౌత్ కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. షిండే వర్గం శివసేన పేరును, పార్టీ గుర్తు విల్లు-బాణాన్ని సంపాదించేందుకు రూ. 2000 కోట్లు లంచంగా ముట్టజెప్పిందని ఆరోపించారు. ఈ మొత్తం ప్రాథమిక అంచనా మాత్రమేనని, ఇంతకంటే ఎక్కువే చేతులు మారి ఉంటుందని ఆదివారం ట్వీట్ చేశారు. ‘శివసేన పేరు, గుర్తు కోసం రూ.2000 కోట్లు చేతులు మారినట్టు నా వద్ద విశ్వసనీయ సమాచారం ఉన్నది. త్వరలో చాలా విషయాలు బయటకు వస్తాయి. అంటూ ట్వీట్ చేశారు.