ట్విట్టర్ కొనుగోలు ఒప్పందం నుంచి తప్పుకుంటున్నట్లు అపర కుబేరుడు, టెస్లా అధినేత ఎలన్ మస్క్ సంచనల ప్రకటన చేశారు. నకిలీ ఖాతాలకు సంబంధించిన పూర్తి సమాచారం ట్విట్టర్ ఇవ్వలేదని, విలీనంలోని పలు ఒప్పందాలను కూడా ఉల్లంఘించిందని మస్క్ ఆరోపించారు. అందుకే తాము ఈ ఒప్పందాన్ని రద్దు చేసుకుంటున్నామని సంచలన ప్రకటన చేశారు.
మరోవైపు విలీన ఒప్పందాన్ని అమలు చేయడానికి బోర్డు చట్టపరమైన చర్యలకు వెళ్లు యోచనలో వున్నామని ట్విట్టర్ చైర్మన్ బ్రెట్ టెయిలో అన్నారు. మస్క్ తో అంగీకరించిన ఒప్పంద నిబంధనల ప్రకారం రద్దు చేయడానికి తమ బోర్డు కట్టుబడే వుందని ఆయన స్పష్టం చేశారు. అయితే.. ముందుగా అనుకున్న ఒప్పందం ప్రకారం.. ఏ కారణం చేతనైనా లావాదేవీని పూర్తి చేయకపోతే 1 బిలియన్ డాలర్లను జరిమానా కింద కట్టాల్సి వుంటుందన్నారు.
గత ఏప్రిల్ లో ట్విట్టర్ కొనుగోలుకు మస్క్ 44 బిలియన్ డాలర్ల ప్రతిపాదనతో ముందుకు వచ్చారు. అయితే స్పామ్, నకిలీ ఖాతాల గురించి సరైన సమాచారం ట్విట్టర్ ఇవ్వడం లేదని తాత్కాలికంగా నిలిపేస్తున్నట్లు ప్రకటించారు. పూర్తి సమాచారం అందే వరకూ ఇలాగే వుంటుందన్నారు. ట్విట్టర్ చెప్పిన దాని కంటే స్పామ్ ఖాతాలు నాలుగు రేట్లు అధికంగా వున్నాయని ఎలన్ మస్క్ ఆరోపిస్తున్నారు.