తెలంగాణలో బీజేపీ గనక అధికారంలోకి వస్తే ఎవరు ముఖ్యమంత్రి అవుతారా? కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అవుతారా? టీఆర్ఎస్ నుంచి వచ్చి, ఎమ్మెల్యేగా గెలిచిన ఈటల రాజేందర్ అవుతారా? కొన్ని రోజులుగా ఈ చర్చ సాగుతోంది. అయితే.. ఎక్కువ మంది ఈటల రాజేందర్ అవుతారని ప్రచారం చేస్తున్నారు. ఈటలను రంగంలోకి దింపితేనే సీఎం కేసీఆర్ కు సరైన ప్రత్యర్థి అవుతారన్న ప్రచారమూ వార్తల్లోకెక్కింది. అయితే…. ఈ విషయంపై ఈటల రాజేందర్ కుండబద్దలు కొడుతూ మాట్లాడారు. తాను ముఖ్యమంత్రి అభ్యర్థి అంటూ వస్తున్న వార్తలను ఎమ్మెల్యే ఈటల ఖండించారు. ఆ వార్తల్లో ఎంత మాత్రమూ వాస్తవం లేదని తేల్చి చెప్పారు. అయితే.. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ పాలనను అంతం చేయడమే తన లక్ష్యమని ప్రకటించారు. తెలంగాణలో కాషాయ జెండా ఎగరేయడం కోసమే తాను బీజేపీలో చేరానని, కేసీఆర్ ను ఓడించడమే తన ముఖ్య లక్స్యమని పునరుద్ఘాటించారు.
రాబోయే ఎన్నికల్లో ఎవరు ముఖ్యమంత్రి అనేది అధిష్ఠానమే నిర్ణయిస్తుందని ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. పార్టీ తనకు ఏ బాధ్యత అప్పజెప్పినా, వందకు వంద శాతం పనిచేస్తానని ప్రకటించారు. పార్టీ నియమ నిబంధనలకు కట్టుబడి వుంటానని, తమ పార్టీ క్రమశిక్షణ గల పార్టీ అని పేర్కొన్నారు. తమ పార్టీలో వున్న వారంతా పార్టీకి అనుగుణంగానే పని చేస్తారని ఈటల రాజేందర్ అన్నారు.