తెలంగాణ సీఎం కేసీఆర్ పై పోటీ చేసే విషయంపై బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం కేసీఆర్ ను ఓడించడమే తన లక్ష్యమని పునరుద్ఘాటించారు. లేదంటే.. తన జన్మకే సార్థకత లేదంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. హుజూరాబాద్ లో తాను గెలవనని టీఆర్ఎస్ నేతలు అంటున్నారని, తాను సిద్ధమని, కేసీఆర్ కు దమ్ముంటే.. తనపై పోటీ చేసి గెలిచి చూపించాలని సవాల్ విసిరారు. కేసీఆర్ ప్రభుత్వం ప్రజల్లో విశ్వాసాన్ని కోల్పోయిందని, ఎన్నికలు ఎప్పుడు వచ్చినా.. ఓడించడానికి ప్రజలు సిద్ధంగా వున్నారని పేర్కొన్నారు. కేసీఆర్ ను, టీఆర్ఎస్ ను బ్రహ్మ దేవుడు కూడా కాపాడలేడంటూ అగ్గిమీద గుగ్గిలమయ్యారు. గజ్వేల్ నుంచి తాను పోటీకి సై అని సవాల్ విసిరినా, దానిని స్వీకరించే స్థాయిలో కూడా కేసీఆర్ లేరంటూ ఎద్దేవా చేశారు. సవాల్ ను స్వీకరించే దమ్ము లేకనే కట్టు బానిసలతో తనపై విమర్శలు చేపిస్తున్నారంటూ ఫైర్ అయ్యారు.
నీచమైన సంస్కృతికి నిలువెత్తు నిదర్శనం సీఎం కేసీఆర్ అని ఈటల తీవ్రంగా మండిపడ్డారు. తెలంగాణకు శనిలా పట్టుకున్నారని, అరిష్టం పోవాలంటే ఎన్నికల్లో కేసీఆర్ ను ఓడించడమే మార్గమని అన్నారు. హైదరాబాద్ చుట్టుపక్కల దళితులకు ఇచ్చిన అసైన్డ్ భూములను గుంజుకొని, వాటిని ప్రభుత్వం అమ్ముకుంటోందని ఈటల ఆరోపించారు. రియల్ ఎస్టేట్ బ్రోకర్ లా కేసీఆర్ ప్రభుత్వం వ్యవహరిస్తోందన్నారు. ధనిక రాష్ట్ర్రం అంటూ పెద్ద గొప్పలకు పోతున్నారని, ఈ ధనిక రాష్ట్రంలో ఉద్యోగులకు జీతాలు, పెన్షనలు కూడా ఇవ్వడంలేదని విమర్శించారు.