ఇటీవలే బీజేపీలో చేరిన మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఢిల్లీలో బిజీబిజీగా గడుపుతున్నారు. బీజేపీ ప్రధాన కార్యాలయంలో కిరణ్ కుమార్ రెడ్డికి కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి కండువా కప్పి, సాదరంగా ఆహ్వానించారు. ఆ తర్వాత బీజేపీ ముఖ్యులను, కేంద్ర మంత్రులను ఆయన కలుసుకున్నారు. మొదట బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా జేపీ నడ్డా కిరణ్ కుమార్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు. బీజేపీలోకి సాదరంగా ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. ఆ తర్వాత కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో కూడా హేటీ అయ్యారు. ఆ తర్వాత బీజేపీ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ తో కూడా భేటీ అయ్యారు.
అయితే… పార్టీలో చేరడం చేరడమే కిరణ్ కుమార్ రెడ్డిపై బీజేపీ ముఖ్యమైన బాధ్యతలు మోపినట్లు సంకేతాలు వస్తున్నాయి. మరికొన్ని రోజుల్లో కర్నాటక ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే నోటిఫికేషన్ కూడా వచ్చేసింది. ఈ నేపథ్యంలో కర్నాటక ఎన్నికల్లో కిరణ్ కుమార్ రెడ్డిని కూడా ఉపయోగించుకోవాలని బీజేపీ నిర్ణయించింది. ఢిల్లీలో బీజేపీ కీలక నేతలు అమిత్ షా, కర్నాటక మాజీ సీఎం యడియూరప్పతో భేటీ అయ్యారు.
వీరిద్దరితో తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. త్వరలో జరిగే కర్నాటక ఎన్నికల నేపథ్యంలో కిరణ్ వీరిద్దరితో భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. కర్నాటక ఎన్నికల్లో తాజా పరిస్ధితులపై చర్చించినట్లు తెలుస్తోంది. త్వరలో కిరణ్ ను కర్నాటక ఎన్నికల ప్రచార బరిలోకి దింపేందుకు బీజేపీ నేతలు సిద్ధమవుతున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ కర్నాటక జిల్లాల్లో ఆయనతో ప్రచారం చేయించే అవకాశం ఉంది. రాయలసీమ జిల్లాలకు చెందిన కిరణ్… కన్నడ భాషలోనూ ప్రావీణ్యం ఉన్నందున ఆయనతో ప్రచారం చేయిస్తే బీజేపీకి ప్రయోజనం ఉంటుందని అధిష్టానం భావిస్తోంది.