మహారాష్ట్ర మాజీ సీఎం, శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ థాకరే సంచలన డిమాండ్ తెరపైకి తెచ్చారు. రాష్ట్రంలో మధ్యంతర ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. రెబెల్ నేతలను శివసేన ఎన్నికల గుర్తు ఇచ్చే ప్రసక్తే లేదన్నారు. అతి తొందరగా ఎన్నికలు పెట్టాలని రెబెల్స్ నేతలకు సవాల్ విసిరారు. తప్పు చేసి వుంటే ప్రజలే ఇంటికి సాగనంపుతారని, రెండున్నరేళ్ల క్రితమే ఈ పనిచేయాల్సింది అని చురకలంటించారు. ఇదంతా అప్పుడే చేసి వుంటే.. ఇదంతా జరిగేదే కాదని ఉద్ధవ్ అన్నారు.
వెన్నుపోటు పొడవాలని అనుకుంటే అప్పుడే చేసి వుంటే బాగుండేదన్నారు. శివసేన గుర్తును తమ నుంచి గుంజుకోవడం ఎవ్వరి తరమూ కాదని ఉద్ధవ్ తేల్చి చెప్పారు. జనం కేవలం గుర్తు చూసి మాత్రమే ఓటు వేయరని, విషయాన్ని కూడా చూస్తారని రెబెల్స్ ను హెచ్చరించారు. బీజేపీ నేతలు తనను, తన కుటుంబాన్ని టార్గెట్ చేస్తూ మాట్లాడినా… ఎవ్వరూ నోరు మెదపలేదని, బీజేపీ వారితో కలిసి సొంత పార్టీ నేతలే వెన్నుపోటు పొడిచారని ఘాటు విమర్శలు చేశారు.