మహారాష్ట్రలో అర్ధరాత్రి వరకూ హైడ్రామే. బలపరీక్ష నిరూపించుకోవాలంటూ గర్నర్ కోషియారీ ఉద్ధవ్ సర్కారును ఆదేశించడంతో, ఉద్ధవ్ సుప్రీం మెట్లెక్కారు. దీనిపై స్టే ఇచ్చేందుకు సుప్రీం నిరాకరించడంతో… సీఎం ఉద్ధవ్ తన పదవికి రాజీనామా చేశారు. దీంతో మహా వికాస్ అగాఢీ ప్రభుత్వం కుప్పకూలింది. ఇక.. శుక్రవారం రోజు మహారాష్ట్రలో బీజేపీ తన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది.
మహారాష్ట్ర 20 వ ముఖ్యమంత్రిగా మాజీ సీఎం, బీజేపీ సీనియర్ నేత దేవేంద్ర ఫడ్నవీస్ దేవేంద్ర ఫడణ్ వీస్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. డిప్యూటీ సీఎంగా రెబెల్స్ కు నాయకత్వం వహించిన ఏకనాథ్ షిండే బాధ్యతలు చేపట్టనున్నారు. బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత ఏక్ నాథ్ షిండేకే డిప్యూటీ సీఎం కట్టబెట్టేందుకు బీజేపీ అధిష్ఠానం రెడీ అయిపోయింది. ఈ మేరకు మాజీ సీఎం ఫడ్నవీస్ అంగీకరించినట్లు కూడా తెలిసింది.
పెరిగిన బీజేపీ బలం..
మహారాష్ట్ర అసెంబ్లీలో మొత్తం 288 సీట్లు. బీజేపీకి 106 మంది ఎమ్మెల్యేలు వున్నారు. శివసేనకు 55, ఎన్సీపీకి 44 మంది వున్నారు. వీరిలో శివసేన నుంచి 39 మంది బీజేపీతో జట్టుకట్టారు. స్వతంత్రులతో కలిసి తమ వర్గంలో 50 మంది ఉన్నారన్నది షిండే చెబుతున్న మాట. దీంతో బీజేపీ బలం మ్యాజిక్ ఫిగర్ కంటే ఎక్కువగానే వుంది. దీంతో బీజేపీ బలం 156 కి పెరిగే ఛాన్స్ వుంది. మహారాష్ట్రలో తిరిగి బీజేపీ సర్కార్ ఏర్పడనుండటంతో బీజేపీ కార్యకర్తలు తెగ జోష్ లో వున్నారు. ఒకరికొకరు మిఠాయిలు పంచుకుంటున్నారు. శుభాకాంక్షలు చెప్పుకుంటున్నారు.