హైదరాబాద్ నగరంలో మళ్లీ భారీ అగ్ని ప్రమాదం జరిగింది. చిక్కడపల్లిలోని వీఎస్టీలోని ఓ గోదాంలో అగ్ని ప్రమాదం సంభవించింది. దీంతో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి. డెకరేషన్ సామాగ్రి పూర్తిగా దగ్ధమైంది. ఫైర్ సిబ్బందికి వెంటనే సమాచారం అందించడంతో అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుంది. గోదాం పరిసర ప్రాంతాల్లో జనావాసాలు వుండటంతో చుట్టు పక్కలకు అగ్ని వ్యాపించకుండా చాలా వేగంగా మంటలను ఆర్పుతున్నారు.
పక్కనే ఉన్న మరో రెండు గోడౌన్లకు కూడా మంటలు వ్యాపించాయి. ఫైర్ ఇంజన్స్ తో పాటు వాటర్ ట్యాంకర్స్ తెప్పించి మంటలను అదుపు చేయడానికి ఫైర్ సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. గోడౌన్స్ పాతవి కావడంతో పైకప్పు రేకులు కూలిపోతున్నాయి. ఉదయం 5 గంటల ప్రాంతంలో గోడౌన్ లో అగ్నిప్రమాదం జరగగా మంటలు వేగంగా వ్యాపించాయి. గోడౌన్ లో డెకరేషన్ కు సంబంధించిన వస్తువులైన స్పాంజి, డెకరేషన్ క్లాత్స్, టెంట్, ప్లాస్టిక్ వస్తువులు ఉండడంతో పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి.
సికింద్రాబాద్ లోని నల్లగుట్ట డెక్కన్ స్పోర్ట్స్ మాల్ లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటన మరిచిపోకముందే బాగ్ లింగంపల్లిలో తాజాగా.. అగ్ని ప్రమాదం సంభవించడంతో ప్రజలు భయపడుతున్నారు. డెక్కన్ స్పోర్ట్స్ మాల్ భవనంలో అగ్ని ప్రమాదం జరిగి పది రోజులు గడుస్తున్నా… ఇంకా యువకుల ఆచూకీ లభించలేదు.
చివరికి అగ్ని ప్రమాదానికి ఆ బిల్డింగ్ చాలా దెబ్బతింది. చివరికి అధికారులు దానిని కూల్చేశారు. దశల వారీగా ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారు. చుట్టు పక్కల బిల్డింగ్‌లకు ఎలాంటి ప్రమాదం వాటిల్లకుండా హైడ్రాలిక్ క్రషర్ డిమాలిషన్ విధానంలో కూల్చివేస్తున్నారు. డైమండ్ కటింగ్‌తో ఒకేసారి భవనం కుప్పకూలకుండా, ఒకవైపు ఒరగకుండా కూల్చివేయడం చేస్తున్నారు. ఈ ప్రమాదం జరిగిన తర్వాత మంత్రి కేటీఆర్ అధ్యక్షతన సమావేశం కూడా జరిగింది. పెద్ద పెద్ద భవనాల్లో ఫైర్ ఆడిట్ తప్పకుండా నిర్వహించాలని నిర్ణయించుకున్నారు.