మన దేశంలో స్వదేశీ పరిజ్ఞానంతో చేసిన తొలి విమాన వాహన నౌక ‘విక్రాంత్’ అందుబాటులోకి వచ్చేసింది. దీనిని కొచ్చిన్ షిప్ యార్డు భారత నావికా దళానికి అప్పజెప్పింది. ‘ఐఎన్ఎస్ విక్రాంత్’ పేరుతో నావికాదళంలో పనిచేస్తుందని రక్షణ శాఖ అధికారులు ప్రకటించారు. విక్రాంత్ నౌక హిందూ మహా సముద్రం ప్రాంతంలో భారత్ పరిస్థితిని మరింత పటిష్ఠం చేసేందుకు ఉపకరిస్తుందని తెలిపారు. భారత దేశంలో ఇప్పటి వరకూ తయారు చేసిన అతిపెద్ద నౌక ఇదేనని, 45,000 టన్నుల సామర్థ్యం వుందని కొచ్చిన్ షిప్ యార్డ్ ఓ ప్రకటనలో పేర్కొంది.
75 వ స్వాతంత్ర్య దినోత్సవాలను జరుపుకుంటున్న ఈ సందర్భంలో ఐఎన్ఎస్ విక్రాంత్ రావడం సంతోషమని కొచ్చిన్ షిప్ యార్డ్ పేర్కొంది. ఇక.. దీని పొడువు 262మీటర్లు. గతంలోని విక్రాంత్ కంటే ఇది చాలా పెద్దది, అత్యంత అధునాతనమైనది కూడా. రెక్కలు కదలకుండా స్థిరంగా ఉండేవిధంగా నిర్మించిన విమానాలు, మిగ్-29కే ఫైటర్ జెట్స్ వంటి రోటరీ ఎయిర్‌క్రాఫ్ట్, కమోవ్-31, ఎంహెచ్-60ఆర్ మల్టీ రోల్ హెలికాప్టర్లు, అదేవిధంగా స్వదేశంలో తయారైన అడ్వాన్స్‌డ్ లైట్ హెలికాప్టర్లు, లైట్ కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్‌లను ఈ విమాన వాహక నౌక మోసుకెళ్ళగలదు.