సుప్రీంకోర్టులో ఐదుగురు కొత్త న్యాయమూర్తుల నియామకానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసిన సుమారు రెండు నెలల తర్వాత దీనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాజస్థాన్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి పంకజ్ మిథాల్, పాట్నా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సంజయ్ కరోల్, మణిపూర్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి పీవీ సంజయ్ కుమార్, పాట్నా హైకోర్టు న్యాయమూర్తి అహ్సానుద్దీన్ అమానుల్లా, అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి మనోజ్ మిశ్రా సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా నియమితులయ్యారు. రాష్ట్రపతి ముర్ము వారిని నియమించినట్లు కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. సుప్రీంకోర్టు కొత్త జడ్జీలకు అభినందనలు తెలిపారు. సుప్రీంకోర్టులో మొత్తం 34 మంది జడ్జీలు ఉండాల్సి ఉండగా ప్రస్తుతం చీఫ్ జస్టిస్ సహా 27 మంది న్యాయమూర్తులు ఉన్నారు. తాజాగా ఐదుగురు కొత్తగా నియమితులు కావడంతో సుప్రీంకోర్టు జడ్జీల సంఖ్య 32కు పెరిగింది.
