కొత్తగా ఇల్లు కొనుగోలు చేసుకోవడం, కట్టుకోవాలనుకునే వారికి కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. పీఎం ఆవాస్ యోజన పథకం కింద ఈ బడ్జెట్ లో మోదీ ప్రభుత్వం భారీగా నిధులను పెంచింది. మొత్తం 79 వేల కోట్లను కేటాయిస్తున్నట్లు నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన చేశారు. గత బడ్జెట్ లో పీఎం ఆవాస్ యోజనకు 48 వేల కోట్లు కేటాయించగా… ఈ సారి ఆ మొత్తాన్ని 66 శాతంగా పెంచి, 79 వేల కోట్లకు పెంచినట్లు ప్రకటించారు. ఇక.. రాష్ట్రాలకు వడ్డీలేని రుణాల పథకం కింద 13.7 లక్షల కోట్లను ప్రకటిస్తున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రాలకు వడ్డీలేని రుణాల పథకాన్ని మరో యేడాది పాటు పొడిగించారు. కీలకమైన వంద మౌలిక వసతుల ప్రాజెక్టులకు 75 వేల కోట్లను కేటాయించారు. బడ్జెట్ లో మూలధన వ్యయానికి 13.5 లక్షల కోట్లను కేటాయించారు.
కోస్టల్ షిప్పింగ్ కి ప్రోత్సాహం ఇస్తున్నట్లు పేర్కొన్నారు. ఇక… ఈ- కోర్టులకు 7 వేల కోట్లు కేటాయిస్తున్నట్లు నిర్మలా సీతారామన్ ప్రకటించారు. బ్యాటరీల నిల్వ కేంద్రాల్లో 4 వేల మెగావాట్లు, పట్టణ మౌలిక సౌకర్యాలకు 10 వేల కోట్లతో నిధిని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. 2030 కల్లా 5MMT హైడ్రోజన్ తయారీ, లద్దాఖ్ కేంద్రంగా పునరుత్పాదక ఎనర్జీ కోసం 20,700 కోట్లను ఇస్తామని, నేషనల్ హైడ్రోజన్ కార్యక్రమానికి 19,700 కోట్లు కేటాయిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ బడ్జెట్‌లో ఏడు ప్రాథమ్యాలు ఉన్నాయన్నారు. సమ్మిళిత అభివృద్ధి, చిట్టచివరి వ్యక్తికి కూడా సత్ఫలితాలు అందడం, మౌలిక సదుపాయాల అభివృద్ధి, పెట్టుబడుల వృద్ధి, ప్రజల శక్తి, సామర్థ్యాలను వినియోగించుకోవడం, హరిత వృద్ధి, యువ శక్తిని ప్రోత్సహించడం, ఆర్థిక రంగాన్ని బలోపేతం చేయడం వంటివాటిపై దృష్టి సారించినట్లు తెలిపారు.