అదానీ షేర్ల పతనంపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పందించారు. దేశ బ్యాంకింగ్ వ్యవస్థ చాలా పటిష్టంగా వుందన్నారు. తమ మొత్తం పెట్టుబడుల్లో అదానీ కంపెనీల్లో పెట్టిన షేర్లు చాలా తక్కువేనని LIC, SBI ఇప్పటికే ప్రకటించాయని ఆమె గుర్తు చేశారు. అదానీ షేర్ల పతనం బ్యాంకింగ్ రంగంపై వుండబోదన్నారు. ఫైనాన్షియల్ స్టెబిలిటీ బోర్డు, ఆర్బీఐతో సమీక్షల తర్వాతే ఈ నిర్ణయం చెబుతున్నానని కూడా స్పష్టం చేశారు. విదేశీ పెట్టుబడిదారులు నిర్భీతిగా భారత్ లో పెట్టుబడులు పెట్టుకోవచ్చన్నారు. నియంత్రణ, నిబంధనల విషయంలో దేశీయ ఫైనాన్షయల్ మార్కెట్ చాలా పటిష్టంగా వుందన్నారు. ఒక్క ఉదంతాన్నే పరిగణనలోకి తీసుకొని, మొత్తం మార్కెట్లను అంచనా వేయడం సరైన విధానం కాదన్నారు.
హిండెన్ బర్గ్ నివేదికతో ప్రారంభమైన అదానీ గ్రూప్ కంపెనీల షేర్ల పతనం ఇంకా కొనసాగుతూనే వుంది. ఈ నేపథ్యంలో అదానీ ఎంటర్ ప్రైజేస్ నుంచి సస్టైనబిలిటీ సూచీ నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించారు. అదానీ గ్రూప్ ఫ్లాగ్‌షిప్ కంపెనీ అదానీ ఎంటర్‌ప్రైజెస్ షేర్ విలువ శుక్రవారం ఏకంగా 30 శాతం నష్టపోయింది. దీంతో అదానీ గ్రూపు కంపెనీల మార్కెట్ విలువ 115 బిలియన్ డాలర్ల మేర తుడిచిపెట్టుకుపోయింది. అదానీ గ్రూపు కంపెనీల్లో ఏడు లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ హిండెన్‌బర్గ్ నివేదికకు ముందు 217 బిలియన్ డాలర్ల నుంచి ప్రస్తుతం 102 బిలియన్ డాలర్లకు పడిపోయింది. ఇక అదానీ పోర్ట్స్ ఎస్ఈజడ్ లిమిటెడ్ 6 శాతం నష్టపోగా, అదానీ ట్రాన్స్‌మిషన్, గ్రీన్ ఎనర్జీ కంపెనీలు పది శాతం చొప్పున పతనమయ్యాయి. అదానీ టోటల్ గ్యాస్ 5 శాతం నష్టపోయింది.
మరోవైపు అదానీ గ్రూపు కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ తుడిచిపెట్టుకుపోవడంతో ఈ గ్రూపునకు రుణాలిచ్చిన బ్యాంకులను పూర్తి వివరాలు అందచేయాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) కోరింది. గత 10 రోజుల్లో అదానీ గ్రూప్‌కు చెందిన కంపెనీల మార్కెట్ విలువ 100 బిలియన్ డాలర్లు అంటే సుమారు రూ.8 లక్షల కోట్లు తగ్గిపోయింది. మొన్నటి దాక ఫోర్బ్స్ ప్రపంచం సంపన్నుల జాబితాలో మూడో స్థానంలో ఉన్న గౌతమ్ అదానీ ఇప్పుడు(ఫిబ్రవరి 2న) 22వ స్థానానికి పడిపోయారు.