కేంద్ర బడ్జెట్ లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మహిళలకు, సీనియర్ సిటిజన్స్ కి తీపి కబురు అందించారు. మహిళల కోసం ప్రత్యేకంగా ఓ పథకాన్ని తీసుకొస్తున్నామని, దాని పేరు ‘మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికేట్’ అని నిర్మలా సీతారామన్ ప్రకటించారు. 2 సంవత్సరాల కాలం పాటు ఈ పథకం అమలులో వుంటుందని పేర్కొన్నారు. ఈ ఫిక్స్ డ్ డిపాజిట్ పథకంలో డిపాజిట్ పై 7.5శాతం స్థిరవడ్డీ వుంటుందని, గరిష్ఠంగా 2 లక్షల వరకూ ఈ పథకంలో డిపాజిట్ చేయవచ్చని పేర్కొన్నారు. పాక్షిక మినహాయింపులకు మాత్రం అవకాశం వుంటుంది.
ఇక.. సీనియర్ సిటిజన్లకు కూడా కేంద్రం గుడ్ గుడ్ న్యూస్ ప్రకటించింది. సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్ కింద ప్రస్తుతం గరిష్ఠ పరిమితి 15 లక్షలు మాత్రమే వుంది. దీనిని 30 లక్షల రూపాయలకు పెంచుతున్నామని నిర్మలా పేర్కొన్నారు. ఇక… నెలవారీ ఇన్ కమ్ స్కీమ్ పరిమితిని కేంద్రం సవరించింది. ఇప్పుడున్న 4.5 లక్షల నుంచి 9 లక్షలకు పెంచారు. జాయింట్ అకౌంట్ కలిగిన వారికి ప్రస్తుతం వున్న 9 లక్షల నుంచి 15 లక్షలకు పెంచారు.
కేంద్ర బడ్జెట్ ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోకసభలో ఉదయం 11 గంటలకు ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా బడ్జెట్ పై కీలక ప్రసంగం చేస్తున్నారు. అంతర్జాతీయ సవాళ్లను ఎదుర్కొనేందుకు భారత్ సిద్ధంగా వుందని, ప్రపంచంలోనే ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అని అభివర్ణించారు. అమృత కాలంలో ఇది తొలి బడ్జెట్ అని అభివర్ణించారు. డిజిటల్ చెల్లింపులు బాగా పెరిగాయని, సమష్టి ప్రగతి దిశగా భారత్ కదులుతోందన్నారు.
స్వచ్ఛ భారత్ లో భాగంగా 11.7 కోట్లతో టాయ్ లెట్స్ నిర్మాణం చెపట్టామని, 44 కోట్ల మందికి పీఎం సురక్షా బీమా యోజన పథకాన్ని అందిస్తున్నామని వివరించారు. 220 కోట్ల కోవిడ్ వ్యాక్సిన్లను అందించామని పేర్కొన్నారు. విశ్వకర్మ కౌశల్ పథకంలో భాగంగా చేనేత కార్మికులకు చేయూత అందిస్తున్నామని, ఉచిత ఆహార ధాన్యాల పథకానికి 2 లక్షల కోట్లను కేంద్రం భరిస్తోందని ప్రకటించారు.