కేంద్ర బడ్జెట్ ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోకసభలో ఉదయం 11 గంటలకు ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా బడ్జెట్ పై కీలక ప్రసంగం చేస్తున్నారు. అంతర్జాతీయ సవాళ్లను ఎదుర్కొనేందుకు భారత్ సిద్ధంగా వుందని, ప్రపంచంలోనే ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అని అభివర్ణించారు. అమృత కాలంలో ఇది తొలి బడ్జెట్ అని అభివర్ణించారు. డిజిటల్ చెల్లింపులు బాగా పెరిగాయని, సమష్టి ప్రగతి దిశగా భారత్ కదులుతోందన్నారు. స్వచ్ఛ భారత్ లో భాగంగా 11.7 కోట్లతో టాయ్ లెట్స్ నిర్మాణం చెపట్టామని, 44 కోట్ల మందికి పీఎం సురక్షా బీమా యోజన పథకాన్ని అందిస్తున్నామని వివరించారు. 220 కోట్ల కోవిడ్ వ్యాక్సిన్లను అందించామని పేర్కొన్నారు. విశ్వకర్మ కౌశల్ పథకంలో భాగంగా చేనేత కార్మికులకు చేయూత అందిస్తున్నామని, ఉచిత ఆహార ధాన్యాల పథకానికి 2 లక్షల కోట్లను కేంద్రం భరిస్తోందని ప్రకటించారు.
కోవిడ్ సమయంలో పీఎం గరీబ్ కల్యాణ్ అన్న యోజన పథకం కింద 80 కోట్ల మందికి ఉచితంగా ఆహార ధాన్యాలను సరఫరా చేశామని, ఈ యేడాది కూడా ఇది కొనసాగుతోందన్నారు. స్థిరీకరణతో కూడిన అభివృద్ధి దిశగా భారత్ అడుగులు వేస్తోందని, దేశ తలసరి ఆదాయం రెట్టింపు అయ్యిందని తెలిపారు. మైనారిటీల సాధికారత, మహిళా సాధికారత, అందరికీ తగిన అవకాశాల కల్పనపై దృష్టి సారించినట్లు తెలిపారు. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంపై దృష్టిపెట్టినట్లు తెలిపారు. ఉజ్వల యోజన క్రింద 9.6 కోట్ల ఎల్‌పీజీ కనెక్షన్లు ఇచ్చినట్లు తెలిపారు. చేతి వృత్తులవారి కోసం ప్రత్యేక ప్రోత్సాహక ప్యాకేజీని ప్రకటించారు.
పర్యాటక రంగాన్ని ఉద్యమ ప్రాతిపదికపై అభివృద్ధి చేస్తామన్నారు. హరిత ఇంధనం ద్వారా గ్రీన్ గ్రోత్‌కు కృషి చేస్తామని, ఈ బడ్జెట్‌కు ఏడు ప్రాధమ్యాలు ఉన్నాయని వెల్లడించారు. సమ్మిళిత అభివృద్ధి, అన్ని వర్గాలకు సమానావకాశాలు, వ్యవసాయానికి డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రా, రైతులకు ఓపెన్ సోర్స్ డిజిటల్ ఇన్‌ఫ్రా, జమ్మూకశ్మీరు, ఈశాన్య భారతం అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టనున్నట్లు తెలిపారు. రైతులను కేంద్రంగా చేసుకుని కార్యక్రమాలను అమలు చేస్తామన్నారు.