అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫ్లోరిడా నగరంలోని తన ఎస్టేట్ పై ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్బీఐ) అధికారులు దాడి చేశారని ఆయన సంచలన విషయాన్ని వెల్లడించారు. తన ఇంటిపై దాడి చేయడమే కాకుండా… ఎఫ్బీఐ ఏజెంట్లు తన వ్యక్తిగత రూమ్ లోకి కూడా చొరబడ్డారని మండిపడ్డారు. ఇవి చీకటి రోజులని అభివర్ణించారు. తన ఇంటిని ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అధికారులు సీజ్ చేశారని, సోదాలు నిర్వహించారని, చాలా మంది ఈ సోదాల్లో పాల్గొన్నారని వెల్లడించారు.
ఇలాంటి పద్ధతి బాగోలేదని, తదుపరి అధ్యక్ష ఎన్నికల్లో తాను పోటీ చేయకూడదన్న ఉద్దేశంతోనే రాడికల్ లెఫ్ట్ డెమోక్రాట్లు చేసిన పని అని ట్రంప్ ఆరోపించారు. అయితే ట్రంప్ ఇంట్లో సోదాలు జరుగుతున్నాయా? లేదా? జరిగితే ఏ కారణంగా జరుగుతోంది? అన్నదానిపై స్పందించేందుకు ఎఫ్‌బీఐ అధికారులు నిరాకరించారు. అయితే.. కొన్ని డాక్యుమెంట్లను ట్రంప్ తప్పుల తడకగా పంపారని… ఆ డాక్యుమెంట్ల గురించే సోదాలు జరుగుతున్నాయని తెలుస్తోంది.