గొత్తికోయల దాడిలో ఎఫ్ఆర్వో శ్రీనివాస రావు హత్యకు గురికావడంపై ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర ఆందోళన, దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దోషులకు కఠినంగా శిక్ష పడేలా చట్టమైన చర్యలన్నీ తీసుకోవాలని డీజీపీ మహేందర్ రెడ్డిని కేసీఆర్ ఆదేశించారు. అదేవిధంగా ఎఫ్ఆర్వో కుటుంబానికి 50 లక్షల పరిహారాన్ని అందిస్తున్నట్లు ప్రటకించారు. కారుణ్య నియామకం కింద కుటుంబ సభ్యుల్లో అర్హులైన ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని, శ్రీనివాసరావు సర్వీసులో ఉన్నట్లుగానే భావిస్తూ… నిబంధనల మేరకు పదవీ విమరణ వయస్సు వరకూ పూర్తి జీతభత్యాలను ఆయన కుటుంబానికి అందిస్తామని కూడా ప్రకటించారు.
విధి నిర్వహణలో వున్న ప్రభుత్వ ఉద్యోగులపై దాడులు చేస్తే మాత్రం సహించమని కేసీఆర్ హెచ్చరించారు. ఇక… ప్రభుత్వ లాంఛనాలతో ఎఫ్ఆర్వో అంత్యక్రియలు నిర్వహించాలని కేసీఆర్ సీఎస్ సోమేశ్ కుమార్ ను ఆదేశించారు. ఇక… ఎఫ్ఆర్వో హత్యను అటవీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఖండించారు. దాడి చేసిన వారిపై కఠిన చర్యలు వుంటాయని స్పష్టం చేశారు.