అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్ లో మరోసారి విషవాయువు లీక్ అయ్యింది. సీడ్స్ దుస్తుల కంపెనీలో విష వాయువు లీకై.. 150 మంది మహిళా ఉద్యోగులు తీవ్రంగా అస్వస్థతకు గురయ్యారు. గాఢమైన విష వాయువు విడుదలై… మహిళా కార్మికులు తీవ్ర ఉక్కిరిబిక్కిరయ్యారు. మహిళలు కళ్లు తిరిగి పడిపోవడంతో ఆ కంపెనీలోనే ప్రాథమిక చికిత్స అందించారు. ఆ తర్వాత బాధితులను అంబులెన్స్ లో అచ్యుతాపురం ఆస్పత్రికి తరలించారు. మరి కొందర్ని ప్రైవేట్ ఆస్పత్రికి కూడా తరలించారు. ఈ విషయం తెలుసుకున్న జిల్లా కలెక్టర్, ఎస్పీ ఘటనా స్థలికి చేరుకున్నారు.
రాష్ట్ర మంత్రి గుడివాడ అమర్ నాథ్ఈ ఘటనపై ఆరా తీశారు. గ్యాస్ లీక్ కు కారణాలను కలెక్టర్ ని అడిగి తెలుసుకున్నారు. తక్షణమే బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. ఇక.. ఈ ఘటనపై ప్రతిపక్షాలు తీవ్రంగా స్పందించాయి. విశాఖను సీఎం జగన్ విషాదపట్నంగా మార్చేశారని టీడీపీ నేత లోకేశ్ విమర్శించారు. నిత్యం అక్కడ ప్రమాదాలు జరుగుతున్నా… ప్రభుత్వం అలసత్వంగా వుందన్నారు. రెండు నెలల వ్యవధిలోనే అచ్యుతాపురం సెజ్ సీడ్ కంపెనీలో రెండు సార్లు గ్యాస్ లీకైందన్నారు. ప్రజల ప్రాణాల పట్ల సీఎం జగన్ ప్రభుత్వానికి లెక్క లేదన్నారు. ఇక… ఈ ఘటనపై ఉన్నత స్థాయి విచారణ జరపాలని సీపీఎం డిమాండ్ చేసింది. యాజమాన్యం నిర్లక్ష్యం, ప్రభుత్వం అలసత్వం వల్లే ఇదంతా జరిగిందని సీపీఎం మండిపడింది.