హైదరాబాద్ శివారు ప్రాంతం బీబీ నగర్ దగ్గర గోదావరి ఎక్స్ ప్రెస్ పట్టాలు తప్పింది. విశాఖపట్నం నుంచి హైదరాబాద్ వస్తుండగా… ఈ ఘటన జరిగింది. నాలుగు బోగీలు పట్టాల నుంచి పక్కకు జరిగాయి. S1,S4,GS, SLR కోచ్ లు పట్టాలు తప్పాయని దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. దీంతో ప్రయాణికులందరూ ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. అయితే ప్రమాదమేమీ లేదని తెలుసుకున్న తర్వాత అందరూ ఊపిరి పీల్చుకున్నారు. దీంతో పెను ప్రమాదమే తప్పింది. ఈ ఘటన జరిగిన సమయంలో రైలు వేగం చాలా తక్కువగా వుందని, అందుకే ఎలాంటి ప్రమాదం జరగలేదని అధికారులు వివరణ ఇచ్చారు.
ప్రయాణికులందరూ సురక్షితంగా వున్నారని ప్రకటించారు. అయితే… ఈ ప్రమాదం జరగడంతో కొందరు ప్రయాణికులు రైలు దిగిపోయి, ప్రత్యామ్నాయ మార్గాలను చూసుకున్నారు. మరోవైపు పట్టాలు తప్పిన బోగీలను వేరుచేసి, అదే రైలులో ప్రయాణికులను గమ్య స్థానానికి పంపినట్లు అధికారులు పేర్కొన్నారు. ఇక…. గోదావరి ఎక్స్ ప్రెస్ పట్టాలు తప్పడంతో ఇతర రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మరి కొన్ని రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి.