శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం శుభవార్త వినిపించింది. తిరుమల శ్రీవారి ప్రత్యేక దర్శనానికి చెందిన 300 రూపాయల టికెట్లను విడుదల చేసింది. అక్టోబర్ నెలకు సంబంధించిన కోటా ఇది. టీటీడీ అధికారులు ఆన్లైన్లో దీన్ని విడుదల చేశారు. సెప్టెంబర్కు సంబంధించిన సేవా టికెట్లను కిందటి నెలలోనే విడుదల చేసింది. అవన్నీ ఇదివరకే భర్తీ అయ్యాయి.ఇప్పుడు తాజాగా అక్టోబర్ నెల కోటా ఆర్జిత సేవా టికెట్లను టీటీడీ అధికారులు భక్తుల కోసం అందుబాటులోకి తీసుకొచ్చారు. టికెట్లను పొందిన వారి జాబితాను కూడా విడుదల చేయనున్నారు. టికెట్ల అలాట్మెంట్ వివరాలను భక్తులకు ఎస్ఎంఎస్, ఇమెయిల్ ద్వారా తెలియజేస్తారు. సెప్టెంబర్ 27 నుంచి అక్టోబర్ 5 వరకు మాత్రం ప్రత్యేక దర్శనం టికెట్ల జారీని నిలిపివేశారు అధికారులు. శ్రీవారి బ్రహ్మోత్సవాలను నిర్వహించనున్నందున ఈ నిర్ణయం తీసుకున్నారు.
