తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ మరో సారి మండిపడ్డారు. వరదల సందర్భంగా తాను ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తే… అధికారులు ఎక్కడా ప్రోటోకాల్ పాటించలేదని మండిపడ్డారు. తాను రాష్ట్ర ప్రథమ పౌరురాలి హోదాలోనే వరద ప్రభావిత ప్రాంతాలకు వెళ్లినట్లు ప్రకటించారు. రాష్ట్రంలోని వరదలపై రాజకీయం చేయడం ఏమాత్రం మంచిది కాదని హితవు పలికారు. ఇక… వరద నష్టంపై కేంద్ర ప్రభుత్వానికి తాము ఓ నివేదిక పంపించామని వెల్లడించారు. గవర్నర్ ను కాబట్టి, రాజ్ భవన్ కే తాను పరిమితం కానని, ప్రజలకు అందుబాటులో వుంటానని ప్రకటించారు. తనకు తోచిన రీతిలో ఎప్పుడూ ప్రజలకు సాయం చేస్తూనే వుంటానని అన్నారు.
కేంద్రం నుంచి తెలంగాణకు రావాల్సిన నిధులు వచ్చాయని, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఈ వివరాలను ప్రకటించారని కూడా అన్నారు. ఇక…. ద్రౌపది ముర్ము రాష్ట్రపతి కావడం ఆనందంగా వుందని, కింది స్థాయి నుంచి వచ్చిన మహిళ… దేశానికే రాష్ట్రపతి కావడం కేవలం మన దేశంలో సాధ్యమైందన్నారు. అయితే రాజ్ భవన్ లో సీఎం కేసీఆర్ తో భేటీ అయిన తర్వాత కూడా ప్రోటోకాల్ లో ఏమీ మార్పులేదని, అయినా… గ్యాప్ గురించి తానేమీ మాట్లాడనని తమిళిసై పేర్కొన్నారు. ఇక… తెలంగాణ గవర్నర్ హోదాలో ఆమె ఢిల్లీలో జరిగిన ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరయ్యారు.