తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ ఇవ్వాళ బాసర ట్రిపుల్ ఐటీలో పర్యటిస్తున్నారు. బాసర ట్రిపుల్ ఐటీలో నెలకొన్న పరిస్థితులను అధ్యయనం చేయడానికే సందర్శనకు వచ్చినట్లు ఆమె ప్రకటించారు. శనివారం రాత్రి రైల్ లో బయల్దేరిన గవర్నర్… ఉదయం బాసరకు చేరుకున్నారు. ఆ తర్వాత బాసర సరస్వతీ దేవిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమం తర్వాత గవర్నర్ ట్రిపుల్ ఐటీని సందర్శించారు. అక్కడి విద్యార్థులతో కలిసి మెస్ లో బ్రేక్ ఫాస్ట్ చేశారు. ఈ సందర్భంగా అక్కడి సమస్యలపై విద్యార్థులతో ముచ్చటించారు.
బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు తీవ్ర ఆవేదనలో వున్నారని గవర్నర్ పేర్కొన్నారు. విద్యార్థులకు బోధించడానికి సరైన అధ్యాపకులు కూడా లేరని, ల్యాప్ టాప్ లు కూడా ఇవ్వలేదన్నారు. విద్యార్థుల సమస్యలు తీర్చదగ్గవేనని అన్నారు. వారి డిమాండ్లు చాలా సింపుల్ గా వున్నాయని , వారి డిమాండ్లను ప్రభుత్వానికి తెలియజేస్తానని పేర్కొన్నారు. మెస్ విషయంలో మాత్రం విద్యార్థులు ఏమాత్రం సంతోషంగా లేరని గవర్నర్ స్పష్టం చేశారు.