నాలుగో రోజు పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ప్రారంభం ప్రారంభమే అదానీ వ్యవహారంతో ఉభయ సభలూ దద్దరిల్లాయి. దీంతో ప్రారంభమైన కొన్ని నిమిషాల వ్యవధిలోనే ఉభయ సభలూ వాయిదాపడ్డాయి. మధ్యాహ్నం 2 గంటల వరకూ ఉభయ సభలు వాయిదాపడ్డాయి. దయం 11 గంటలకు లోక్‌సభ(Loksabha) ప్రారంభం కాగానే.. విపక్ష సభ్యులు వెల్‌లోకి దూసుకువెళ్లి ఆందోళనలు చేపట్టారు. స్పీకర్ ఓం బిర్లా(Om Birla) సభ్యులను శాంతింప చేసే ప్రయత్నం చేశారు. సభను నడిపించాలనుకుంటున్నానని, అందరికీ అవకాశం ఇస్తానన్నారు. కానీ సభ ఆర్డర్‌లో ఉండాలన్నారు. సభ సజావుగా సాగాలన్నారు. ప్రతి సభ్యుడికి సమయం ఇచ్చానన్నారు. అయినా కానీ విపక్ష సభ్యులు వినలేదు. వెల్‌లోకి దూసుకువెళ్లి నిరసన కొనసాగించారు. ఇక రాజ్యసభలోనూ ఇదే సీన్ రిపీట్ అయ్యింది. అదానీ వ్యవహారాన్ని విపక్షాలు లేవనెత్తాయి.
అయితే… అధికార బీజేపీ కూడా నిరసనలకు దిగింది. లండన్ వేదికగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తాను చేసిన వ్యాఖ్యలకు వెంటనే క్షమాపణలు చెప్పాలని బీజేపీ సభ్యులు డిమాండ్ చేశారు. కాంగ్రెస్ నేతలకు కౌంటర్ ఇచ్చారు. దీంతో రాజ్యసభలో తీవ్ర గందరగోళం నెలకొంది. రాహుల్ పై కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు తీవ్రంగా మండిపడ్డారు. దేశానికి హాని చేయాలని చూస్తే దేశ పౌరునిగా తాము నిశ్శబ్దంగా వుండలేమని పేర్కొన్నారు. భారత జాతికి రాహుల్ గాంధీ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. రాజ్యాంగ వ్యవస్థలైన న్యాయ వ్యవస్థ, పార్లమెంట్ ను తూలనాడారని మండిపడ్డారు. వెంటనే పార్లమెంట్ కి రాహుల్ వచ్చి, క్షమాపణలు చెప్పాలని కిరణ్ రిజిజు డిమాండ్ చేశారు.