రాజస్థాన్ లో సంభవించిన అతి క్రూర మర్డర్ పై కేంద్ర హోంశాఖ స్పందించింది. ఈ కేసును తక్షణమే విచారణ నిమిత్తం తమ చేతుల్లోకి తీసుకోవాలని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ ఐఏ) ను ఆదేశించింది. ఈ కేసును లోతుగా అధ్యయనం చేసేందుకు ఎన్ ఐఏ కూడా సిద్ధమైంది. ఇప్పటికే ఎన్ ఐఏ అధికారులు రాజస్థాన్ కు చేరుకున్నారు. దీనిపై సమగ్రంగా దర్యాప్తు చేస్తామని కూడా ప్రకటించారు.
మరోవైపు రాజస్థాన్ లోని అశోక్ గెహ్లోత్ ప్రభుత్వం కూడా ఈ హత్యపై సిట్ ను ఏర్పాటు చేసింది. ఇక ఈ హత్య నేపథ్యంలో నెలపాటు రాష్ట్రంలో 144 సెక్షన్ అమలులో వుంటుందని పోలీసులు ప్రకటించారు. ఇక.. బుధవారం రోజంతా ఇంటర్నెట్ సేవలు బంద్ చేయనున్నట్లు ప్రకటించారు.
నిందితులకు పాక్ ఉగ్రవాద సంస్థలతో లింక్…
ఉదయపూర్ దర్జీ హత్య కేసులో నిందితులకు పాక్ ఆధారిత ఉగ్ర సంస్థతో సంబంధాలున్నాయని వెల్లడైంది. ఈ మేరకు భద్రతా సంస్థలు పేర్కొన్నాయి. రియాజ్ అహ్మద్, గౌస్ మహ్మద్ కు దావత్-ఎ- ఇస్లామీతో సన్నిహిత సంబంధాలున్నాయని భద్రతా సంస్థలు తేల్చి చెబుతున్నాయి. మరోవైపు దర్జీ కన్హయ్యను కిరాతకంగా హత్య చేసిన ఇద్దర్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.