తెలుగు సినిమా ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ సినీ ఎడిటర్ గౌతం రాజు (68) కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో ఆయన బాధపడుతున్నారు. ఆ కారణంగానే ఆయన తుదిశ్వాస విడిచారు. ఈయన మరణ వార్త వినగానే చిత్ర పరిశ్రమలో విషాదం నిండింది. రాత్రి 1.30 గంటలకు మరణించినట్లు వైద్యులు తెలిపారు.
తెలుగులో అగ్ర హీరోల బ్లాక్ బస్టర్ చిత్రాలకు ఆయన ఎడిటింగ్ అందించారు. చిరంజీవి, మాధవి జంటగా నటించిన చట్టానికి కళ్లు లేవు చిత్రంలో ఎడిటర్ ఈయనే. సౌత్ సినిమాలతో పాటు హిందీ సినిమాలకు కూడా ఎడిటింగ్ చేశాడు. దాదాపు 800 సినిమాలకు ఎడిటర్ గా పనిచేసి, నంది అవార్డు గెలుచుకున్నారు. కిక్, రేసుగు్రరం, గోపాల గోపాల, గబ్బర్ సింగ్, ఖైదీ నెంబర్ 150, బలుపు, అదుర్స్ లాంటి సినిమాలు ఎడిటింగ్ చేశారు.
అరుణాచలం థియేటర్ లో ఆపరేటివ్ కెమెరామెన్ గా కెరీర్ ప్రారంభమైంది. ఎడిటర్ కమ్ డైరెక్టర్ సంజీవి దగ్గర మెళుకువలు నేర్చుకున్నాడు. తమిళ చిత్రం అవళ్ ఓరు పచ్చికొళందై తో ఎడిటర్ ప్రమోషన్ పొందారు. ఆ తర్వాత జంధ్యాల మొదటి సినిమా నాలుగు స్తంభాలాట చిత్రానికి ఎడిటర్ అయ్యారు. శ్రీవారి ప్రేమలేఖ, మయూరి, చందమామ రావె, హైహై నాయకా, భారత నారి, ఆది చిత్రాలకు నంది అవార్డులు గెలుచుకున్నారు.