ఈడీ విచారణతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న కాంగ్రెస్ కు మరో షాక్ తగిలింది. ఆ పార్టీ సీనియర్ నేత, జీ 23 లో కీలక నేతగా వున్న గులాంనబీ ఆజాద్ మరోసారి కాంగ్రెస్ కు షాకిచ్చారు. జమ్మూ కశ్మీర్ ప్రచార కమిటీ చైర్మన్ బాధ్యతలను ఆజాద్ కు కట్టబెట్టాలని సోనియా గాంధీ నిర్ణయించారు. ఈ ఆఫర్ ను స్వీకరించినట్టే స్వీకరించి…. కాసేపటికే.. గులాంనబీ ఆజాద్ ఆ పదవికి రాజీనామా చేసి సంచలనం రేపారు. అంతేకాకుండా జమ్మూ కశ్మీర్ రాజకీయ వ్యవహారాల కమిటీ పదవి నుంచి సైతం తప్పుకుంటున్నానని సంచలన ప్రకటన చేశారు.
అయితే… ఇందుకు రాజకీయ కారణాలు లేవని, కేవలం ఆరోగ్య సమస్యలేనంటూ గులాంనబీ ప్రకటించడం విశేషం. అయితే…. కొన్ని రోజులుగా గులాంనబీ ఆజాద్ అధిష్ఠానంపై తీవ్ర అలకగా వున్నారు. అంతేకాకుండా జీ 23 గ్రూపులో అత్యంత కీలకంగా కూడా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో గులాంనబీ ఆజాద్ ఈ ఆఫర్ ను తిరస్కరించడంతో అధిష్ఠానం తలపట్గుకుంది. ఇప్పటికైతే… గులాంనబీ తిరస్కరణపై అధిష్ఠానం ఎలాంటి స్పందనా వెలువరించలేదు.