అగ్రరాజ్యం అమెరికాలో మళ్లీ కాల్పుల మోత మోగింది. వైట్ హౌజ్ కు అత్యంత సమీపంలోనే కాల్పుల మోత మోగింది. అమెరికా రాజధాని వాషింగ్టన్ లోని 14 వ యూ స్ట్రీట్ లోని మ్యూజిక్ ఈవెంట్ లో కాల్పులు రేగాయి. ఈ కాల్పుల్లో ఓ యువకుడు చనిపోయాడు. పలువురు గాయపడ్డారు. ఈ ఘటన వైట్ హౌజ్ కు కేవలం 2 కిలోమీటర్ల దూరంలోనే జరగడం కలకలం రేపుతోంది.
ఈ కాల్పులు జరగగానే పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. కాల్పుల్లో గాయపడిన వారి ఆరోగ్యం నిలకడగానే వుందని పోలీసులు తెలిపారు. అయితే.. ఈ కాల్పుల్లో ఓ పోలీస్ అధికారి మరణించినట్లు తెలుస్తోంది.
ఇక ఒక్కసారిగా ఇలా కాల్పుల శబ్దం రావడంతో అక్కడి ప్రజలు పరుగులు పెట్టారు. రోడ్లపై అటు ఇటుగా పరుగులు తీశారు. కాల్పులు జరిగిన వెంటనే పోలీసులు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టారు. అటు వైపు ఎవరూ వెళ్లవద్దని ఆంక్షలు విధించారు. అయితే ఎందుకు కాల్పులు జరిపారన్నది మాత్రం తెలియాల్సి వుంది.