భారత 75 వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా స్వాతంత్ర యోధులను స్మరిస్తూ ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా.. ఈ ఉత్సవాల్లో భాగంగా కేంద్రం మరో భారీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఆగస్టు 15 న ప్రతి ఇంటి మీద జాతీయ జెండా ఎగిరేలా ప్రచారం చేయనుంది. దీని పేరు ‘హర్ ఘర్ తిరంగా’ అని పేరు పెట్టారు. కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ప్రతి ఇంటి మీదా జాతీయ జెండా ఎగిరేలా ప్రోత్సహించేందుకు కేంద్రం అన్ని ఏర్పాట్లు చేస్తూ.. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనుంది. ఈ క్రమంలో ఫ్లాగ్ కోడ్ ఆఫ్ ఇండియా, 2002 ప్రకారం జాతీయ జెండాను అగౌరవపర్చకుండా నిర్దేశించిన నిష్పత్తి (3:2)లో తయారు చేసిన జెండాను ఎవరైనా సరే తమ ఇంటి వద్ద ఎగుర వేయవచ్చు.
జాతీయ జెండాలను ప్రజలందరికీ అందుబాటులో ఉంచేందుకు స్వయం సహాయక బృందాలను భాగస్వాములను చేస్తూ భారీగా జాతీయ జెండాలను రూపొందిస్తున్నట్టు కేంద్ర సాంస్కృతిక శాఖ తెలియజేసింది. ఈ-కామర్స్ పోర్టల్స్ సహా విస్తృతంగా జాతీయ జెండాలను అందుబాటులో ఉంచుతామని, జెండాను రూ. 25 కు నామమాత్రపు ధరతో ప్రజల భాగస్వామ్యం కూడా ఉండేలా ఈ కార్యక్రమాన్ని రూపొందిస్తున్నామని వెల్లడించారు.