కాకతీయ మెడికల్ కాలేజీలో అనస్థీషియా మొదటి సంవత్సరం చదువుతున్న పీజీ విద్యార్థి ఆత్మహత్యాయత్నం చేసింది. కాకతీయ మెడికల్ కాలేజీలో పీజీ అనస్థీషియా చేస్తున్న ప్రీతిని ఆమె సీనియర్ సైఫ్ తీవ్ర వేధింపులకు గురిచేశాడు. దీంతో తీవ్ర మనస్థానికి గురై ప్రీతి… మత్తు ఇంజెక్షన్ తీసుకొని, ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఎమర్జెన్సీ ఆపరేషన్ థియేటర్(ఓటీ)లో విధులు నిర్వహిస్తుండగా ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. స్పృహలేని స్థితిలో ఉన్న ఆమెను వెంటనే అక్కడి నుంచి ఎమర్జెన్సీ వార్డులోకి తరలించి, అత్యవసర వైద్యం అందించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం హూటాహుటిన హైదరాబాద్‌లోని నిమ్స్ ఆస్పత్రికి తరలించారు.
ఆమెను ఏఆర్‌సీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. వెంటిలేటర్‌పై వైద్యచికిత్స అందిస్తున్నామని, ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. సీనియర్ సైఫ్ కొన్నేళ్లుగా ప్రీతిని వేధిస్తున్నట్లు ప్రీతి మిత్రులు పేర్కొంటున్నారు. ప్రీతి స్వగ్రామం జనగామ జిల్లా కొడకండ్ల మండలం మొండ్రాయి. ఆమె తండ్రి ధరావత్ నరేందర్ నాయక్. వరంగల్ రైల్వేస్టేషన్ ఆర్పీఎఫ్ ఏఎస్సైగా పనిచేస్తున్నారు. ఆయనకు ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు.
ప్రీతిని కాపాడేందుకు నిమ్స్ వైద్యులు శతవిధాలుగా ప్రయత్నిస్తున్నారు. ఆమె పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు నిమ్స్ వైద్యులు తెలిపారు. అనస్తీషియా ఎక్స్‌పర్ట్ డాక్టర్ పద్మజ పర్యవేక్షణలో అయిదుగురు డాక్టర్ల స్పెషల్ టీమ్ తో ప్రీతికి చికిత్స అందుతోంది. ఎంత ఖర్చయినా ప్రీతి వైద్యంలో వెనుకాడమని నిమ్స్ అధికారులు చెబుతున్నారు. వరంగల్ నుంచి హైదరాబాద్ నిమ్స్‌కు తరలించేలోగా ప్రీతి గుండె చప్పుడు రెండు సార్లు ఆగిపోయింది. వెంటనే సీపీఆర్ చేయాడంతో తిరిగి గుండె కొట్టుకోవడం మొదలుపెట్టింది. ప్రస్తుతానికి వెంటిలేటర్‌య పైనే ప్రీతికి చికిత్స కొనసాగుతోంది.
మరోవైపు ప్రీతి ర్యాగింగ్ కేసు విచారణను పోలీసులు ముమ్మరం చేశారు. ప్రీతిని వేధించిన సీనియర్ సైఫ్‌పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. సైఫ్‌ను పోలీసులు విచారించనున్నారు. సైఫ్ స్వస్థలం హనుమకొండ జిల్లా కాజీపేట. తన అక్కను సీనియర్లు కొన్ని రోజులుగా వేధిస్తూనే వున్నారని ప్రీతి సోదరుడు పేర్కొన్నాడు.