రాష్ట్రంలోని కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఆర్థిక మంత్రి హరీశ్‌రావు శుభవార్త వినిపించారు. ఇచ్చిన మాట ప్రకారం ఏప్రిల్ నెల నుంచి కాంట్రాక్ట్ ఉద్యోగుల సర్వీసులను క్రమబద్దీకరణ చేస్తున్నట్లు ప్రకటించారు. సెర్ఫ్ ఉద్యోగులకు పే స్కేల్ సవరణ చేయబోతున్నామని తెలిపారు.కేంద్ర ప్రభుత్వం నిధులలో కోతలు పెడుతూ, అనేక ఆర్థిక ఆంక్షలు పెడుతున్నప్పటికీ, రాష్ట్రంలో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల కోసం పెద్ద ఎత్తున ఆర్థిక అవసరాలు ఉన్నప్పటికీ, తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధ్యాయుల ప్రయోజనాల విషయంలో ఏనాడు తక్కువ చేయలేదన్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల విజ్ఞప్తుల మేరకు కొత్త ఈహెచ్ఎస్ విధానాన్ని తీసుకురాబోతున్నామని హరీశ్‌రావు ప్రకటించారు. ఎంప్లాయిస్ హెల్త్ కేర్ ట్రస్ట్‌ను ఏర్పాటు చేసి ఇందులో ప్రభుత్వ ప్రతినిధులతో పాటు ఉద్యోగ, ఉపాధ్యాయ, రిటైర్డ్ ఉద్యోగుల ప్రతినిధులను భాగస్వాములుగా చేస్తామన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో మరో 60 జూనియర్, సీనియర్ జిల్లా జడ్జి కోర్టులను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు ఆర్థిక మంత్రి హరీశ్‌రావు తన బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు. రాష్ట్రంలోని ప్రజలకు సత్వర న్యాయం అందించడం కోసం.. జిల్లా కోర్టులను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ఈ క్రమంలోనే నూతనంగా ఏర్పడిన 23 జిల్లాల్లో జిల్లా కోర్టులను, న్యాయ సేవాధికార సంస్థలను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఈ కోర్టుల నిర్వహణ కోసం 1,721 పోస్టులను కొత్తగా మంజూరు చేశామన్నారు. రూ. 1050 కోట్ల అంచనా వ్యయంతో కొత్త కోర్టుల భవనాల నిర్మాణం చేపట్టడం జరుగుతుందన్నారు.
విద్యారంగాన్ని బలోపేతం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని మంత్రి హరీశ్ రావు తెలిపారు. పేద పిల్లలు చదువులో ముందుండాలంటే గురుకుల విద్య ద్వారానే సాధ్యమని విశ్వసించిన సీఎం కేసీఆర్.. రాష్ట్రంలో గురుకుల విద్యకు పెద్దపీట వేశారు. రాష్ట్రం ఏర్పడినప్పుడు 293గా ఉన్న గురుకులాలను ఇప్పుడు 1,002కు పెంచారని పేర్కొన్నారు. అందుకోసం బడ్జెట్‌లో రూ.7,289 కోట్ల నిధులను కేటాయించారు. మొదటి దశలో భాగంగా రూ.3,497 కోట్ల నిధులతో 9,123 పాఠశాలల్లో మౌలిక వసతులను కల్పిస్తున్నారు. అదేవిధంగా యూనివర్సిటీల్లో మౌలిక వసతుల కల్పన, హాస్టల్ భవనాల ఆధునీకరణ, కొత్త భవనాల నిర్మాణం కోసం ఈ బడ్జెట్‌లో రూ.500 కోట్లను కేటాయించారు.