హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ (హెచ్ సీయూ) లో దారుణం జరిగింది. థాయిలాండ్ కు చెందిన విద్యార్థినిపై ప్రొఫెసర్ రవి రంజన్ అత్యాచారయత్నం కలకలం రేపింది. ఆ అమ్మాయి తప్పించుకొని పారిపోయింది. ఈ మేరకు గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. దీంతో ప్రొఫెసర్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటన నేపథ్యంలో ప్రొఫెసర్ రవి రంజన్ ను సస్పెండ్ చేస్తున్నట్లు హెచ్ సీయూ రిజిస్ట్రార్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో లిఖిత పూర్వకంగా చూపిస్తేనే.. ఆందోళన విరమిస్తామని స్టూడెంట్స్ డిమాండ్ చేశారు. రవిరంజన్ లాంటి కీచక ప్రొఫెసర్లు మరికొందరు ఉన్నారని..ఇప్పటికే వాళ్లపై పలుమార్లు ఫిర్యాదు చేశామన్న విద్యార్థులు.. వారి సంగతేంటని ప్రశ్నించారు.
దీంతో ప్రొఫెసర్ రవిరంజన్ ని సస్పెండ్ చేస్తున్నట్లు రిజిస్ట్రార్ లిఖితపూర్వకంగా తెలిపారు. బాధిత యువతికి యూనివర్సిటీ తరపున అండగా ఉంటామని రిజిస్ట్రార్ స్పష్టం చేశారు. అంతకు ముందు ప్రొఫెసర్ పై కఠిన చర్యలు తీసుకోవాలంటూ విద్యార్థి సంఘాలు ధర్నాకు దిగాయి. యూనివర్శిటీ గేటు ఎదుట ప్రొఫెసర్ కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ, ఆందోళన చేశారు. ప్రొఫెసర్ ను విధుల నుంచి తొలగించాలంటూ ఏబీవీపీ డిమాండ్ చేసింది.