అమర్ నాథ్ లో పడుతున్న భారీ వర్షాల కారణంగా 13 మంది భక్తులు ప్రాణాలు కోల్పోయారు. కొండలపై నుంచి ఒక్కసారిగా భారీగా వరద నీరు రావడంతో గుడారాలతో పాటు భక్తులు కూడా కొట్టుకుపోయారు. దాదాపు 40 మంది కొట్టుకుపోయారని స్థానిక అధికారులు పేర్కొంటున్నారు. ఇలా కొట్టుకుపోయిన వారిలో ఏడు మందిని అధికారులు కాపాడారు. అమర్ నాథ్ లో భారీగా వర్షం పడుతున్న సమయంలో దర్శనార్థం 13 వేల మంది భక్తులు వున్నారు. ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. భక్తులను కాపాడడానికి ఐటీబీపీ, సీఆర్పీఎఫ్, బీఎస్ ఎఫ్, ఎన్డీఆర్ ఎఫ్ బృందాలు సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి.
ఇక వరదలు భారీగా రావడంతో అమరనాథ్ సమీపంలోన బేస్ క్యాంప్ పూర్తిగా దెబ్బతిన్నది. యాత్రికుల కోసం ఆహారం అందించే వంట శాలలు, గుడారాలు కూడా కొట్టుకుపోయాయి. ఇక.. లోతట్టు ప్రాంత వాసులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. అమర్ నాథ్ యాత్రను తాత్కాలికంగా నిలిపేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. మరోవైపు ఈ ఘటనపై రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్, ప్రధాని మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మరణించిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. మరోవైపు జమ్మూ కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హాతో ప్రధాని మోదీ ఫోన్లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.