హైదరాబాద్ లో మళ్లీ భారీ వర్షాలు పడుతున్నాయి. శుక్రవారం ఉదయం చిరు జల్లులతో ప్రారంభమైన వాన… జోరు వానగా మారిపోయింది. దీంతో హైదరాబాద్ వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోడ్లన్నీ జలమయం అయ్యాయి. ట్రాఫిక్ జామ్ విపరీతంగా అయ్యింది. ఇళ్లల్లోకి నీరు వచ్చి చేరింది. ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో వర్షాలు పడుతున్నాయి. హైదరాబాద్ లోని 15 ప్రాంతాల్లో 5 సెంటిమీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది. బేగంపేట, లింగంపల్లి, బొల్లారం ప్రాంతాల్లో రోడ్లపైకి నీళ్లు వచ్చి చేరాయి. దీంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. సికింద్రాబాద్, బోయిన్ పల్లి, మారేడ్ పల్లి, చిలకలగూడ, బేంగంపేల, బంజారా హిల్స్, జూబ్లీహిల్స్, హైటెక్ సిటీ, టోలీచౌకీ, ఖైరాతాబాద్ తో సహా మిగిలిన ప్రాంతాల్లో విపరీతంగా వర్షం పడింది. దీంతో ట్రాఫిక్ సమస్యలు తీవ్రంగా ఏర్పడ్డాయి. శేరిలింగంపల్లిలో అత్యధికంగా 9.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. కూకట్ పల్లిలో 9.2 సెం.మీ., కుత్బుల్లాపూర్ లో 9 సెం.మీ, జీడిమెట్లలో 8.8. సెం.మీటర్ల వర్షపాతం నమోదైంది.
ఇక శివారు ప్రాంతాలైన రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్ గిరితో పాటు వికారాబాద్ లోనూ విస్తారంగా వర్షాలు పడ్డాయి. మరో 48 గంటల పాటు భారీ వర్సాలు కురుస్తాయని వాతావరణ శాఖ డైరెక్టర్ నాగరత్నం ప్రకటించారు. ప్రజలందరూ, ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా వుండాలని ఆమె సూచించారు. శేరిలింగంపల్లి, రాజేంద్ర నగర్ లో కూడా భారీగా వర్షం పడింది. హఫీజ్ పేటలో 11.5 సెం.మీ, రాజేంద్ర నగర్ లో 10.2 సెంటీమీటర్ల వర్షం కురిసింది. శేరిలింగంపల్లిలోని ఎల్లమ్మబండ, పీజేఆర్ నగర్, గురుగోవింద్ కాలనీల్లో భారీగా వర్షపు నీరు వచ్చి చేరింది. రోడ్లన్నీ నీటితో నిండిపో్యాయి.
మరోవైపు హైదరాబాద్ లోని జంట జలాశయాలకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ కు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ఉస్మాన్ సాగర్ ఇన్ ఫ్లో 2 వేల క్యూసెక్కులు కాగా, నాలుగు గేట్ల ద్వారా 832 క్యూసెక్కుల నీటిని మూసీలోకి విడుదల చేశారు. ఉస్మాన్ సాగర్ జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 1790 అడుగులు కాగా.. ప్రస్తుతం 1,786.65 అడుగుల వరకూ నీరు చేరింది. హిమాయత్ సాగర్ కు 500 క్యూసెక్కులు ఇన్ ఫ్లో వస్తుండగా… రెండు గేట్ల ద్వారా 330 క్యూసెక్కుల నీటిని మూసీలోకి అధికారులు వదిలేస్తున్నారు.