ఇవ్వాళ ఉదయం నుంచీ హైదరాబాద్ లో వర్షం ఏకధాటిగా కురుస్తూనే వుంది. దీంతో రోడ్లన్నీ పూర్తిగా జలమయం అయ్యాయి. రోడ్లపై వరద నీరు భారీగా నిలిచిపోయింది. ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎక్కడికక్కడ వాహనాలు ఆగిపోయాయి. దీంతో భారీగా ట్రాఫిక్ జాం ఏర్పడింది. అయితే.. వానకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా పోస్ట్ అయ్యాయి. అంత భారీ వర్షం పడుతోంది.
భారీ వర్షం కారణంగా సిటీ ప్రజలకు సిటీ పోలీసులు పలు కీలక సూచనలు చేశారు. వర్షం ఆగిపోగానే ఎవ్వరూ బయటికి రావొద్దని కోరారు. వర్షం ఆగిన ఓ గంట తర్వాతే బయటకు రావాలని, అప్పటి వరకూ ఇంట్లోనే వుండాలని కోరారు. అలా కాదని రోడ్లపైకి వస్తే.. ట్రాఫిక్ లో ఇరుక్కుపోవడం ఖాయమని, ఇబ్బందులు పడతారని పోలీసులు హెచ్చరించారు.
#Madhapur #Hitechcity#HyderabadRains pic.twitter.com/jPD3FLs3Px
— Bicycle Mayor of Hyderabad (@sselvan) July 22, 2022
సొంత వాహనాల కంటే బస్సులు, మెట్రో రైళ్లల్లో ప్రయాణాలు చేస్తే… సమయం మిగులుతుందని సూచించారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా.. జీహెచ్ ఎంసీతో కలిసి పనిచేస్తున్నామని పోలీసులు తెలిపారు. మరో వైపు జీహెచ్ ఎంసీ సిబ్బంది అలర్ట్ గా వుండాలని జీహెచ్ ఎంసీ కమిషనర్ లోకేశ్ కుమార్ సిబ్బందిని ఆదేశించారు. రాబోయే మూడు నాలుగు గంటల్లో ఎక్కువ వర్షపాతం నమోదయ్యే ఛాన్స్ వుందన్నారు. ప్రజలకు ఇబ్బందులు రాకుండా చూడాలని, లోతట్టు ప్రాంతాల్లో ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలని ఆదేశించారు.