తెలంగాణలో మళ్లీ కుండపోత వర్షాలు ప్రారంభమయ్యాయి. కొన్ని రోజుల క్రితం వరకూ వరుసగా వారం రోజుల పాటు భారీ వర్షాలు పడ్డాయి. కాస్త సర్దుకుంటుంది అనేలోపే.. మళ్లీ ముసురు అందుకుంది. శుక్రవారం ఉదయం నుంచి హైదరాబాద్ లో వర్షం పడుతూనే వుంది. భాగ్యనగరంతో పాటు ఆదిలాబాద్, మహబూబు నగర్, జనగామ, సూర్యాపేట, యాదాద్రి జిల్లాలు అలర్ట్ వుండాలని ప్రభుత్వం ప్రకటించింది. మరో 4 రోజుల పాటు కుంభవ్రుష్టి పడే అవకాశాలున్నాయని వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. అవసరమైతే తప్ప… ప్రయాణాలెవ్వరూ పెట్టుకోవద్దని కోరారు. అలాగే వరంగల్, ఖమ్మం, నల్లగొండ జిల్లాల్లో ని పలు ప్రాంతాల్లో మాత్రం భారీ వర్షాలు కురిశాయి. మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లిలో 21.1. సెంటిమీటర్ల అతి భారీ వర్షం కురిసింది. నైరుతి సీజన్ లో సాధారణంగా జూలై 22 నాటికి 29.26 సెంటీమీటర్ల సగటు వర్షపాతం నమోదు కావాల్సి వుంది. ఈసారి ఇదే సమయానికి ఏకంగా 58.50 సెంటీమీటర్ల వర్షపాతం రికార్డైనట్లు అధికారులు చెబుతున్నారు.
ఆరు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ …..
నిన్నటి నుంచి పలు జిల్లాల్లో భారీ వర్షాలు మళ్లీ ప్రారంభమయ్యాయి. ప్రజల జీవనం అస్తవ్యస్తమైంది. వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. రోడ్లు జలమయం అయ్యాయి. ముఖ్యంగా ఖమ్మం, సూర్యాపేట, వరంగల్, హన్మకొండ, మహబూబాబాద్, జనగామ జిల్లాలకు వాతావరణ కేంద్రం ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. ఈ జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడతాయని వాతావరణ కేంద్రం ప్రకటించింది. మిగతా జిల్లాలకు మాత్రం ఎల్లో అలర్ట్ ప్రకటించారు. ఈ ఎల్లో అలర్ట్ జిల్లాల్లో మాత్రం మోస్తారు వర్షాలు పడతాయని పేర్కొన్నారు.
ఇక.. మహబాబూ బాద్ జిల్లాలో కుండ పోత వర్షం కురిసింది. దంతాపల్లి, నెల్లికుదుు, నర్సింహుల పేట, కొమ్ముల వంచ, పెద్దనాగారం గ్రామాల్లో అతి భారీ వర్షం పడింది. శుక్రవారం అంతావర్షం పడటంతో వాగుల్లో ప్రవాహం కూడా ఒక్కసారిగా పెరిగిపోయింది. మహబూబాబాబాద్, మరిపెడ, తొర్రూరు పట్టణాల నుంచి పరిసర ప్రాంతాలకు వెళ్లే ప్రజలు వాగులు దాటాల్సిన సమయంలో చాలా ఇబ్బందులు పడాల్సి వచ్చింది. ఇక… జనగామ జిల్లా కేంద్రంలోని హైదరాబాద్ ప్రధాన రహదారి పూర్తిగా జలమయమైంది. చీటూర్ గ్రామానికి చెందిన 14 మంది కూలీలు కన్నాయపల్లిలో 14 మంది కూలీలు వాగులో చిక్కుకున్నారు. తర్వాత అధికారులు వారిని రక్షించినట్లు తెలుస్తోంది. ఇక తొర్రూరు నుంచి పెద్దముప్పారం గ్రామానికి వెళ్తున్న ఓ స్కూల్ బస్సు పాలేరు వాగులో చిక్కుకుపోయింది. సమాచారం అందగానే విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామస్థులు అక్కడికి చేరుకున్నారు. 20 మంద విద్యార్థులను బయటకి తీసుకొచ్చారు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.