తెలంగాణ అంతటా ఎడతెరిపి లేని వానలు కురుస్తున్నాయి. చాలా చోట్ల వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. రోడ్లను వరద ముంచెత్తడంతో వందలాది గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఇళ్లలోకి వరద నీరు చేరడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆసిఫాబాద్, నిర్మల్, నాగర్ కర్నూల్, పెద్దపల్లి, జనగామ, భూపాలపల్లి, ములుగు ప్రాంతాల్లో విపరీతంగా వర్షాలు కురుస్తున్నాయి. మహబూబాబాద్ జిల్లాలో ఆకేరు, పాలేరు వాగులు పొంగి పొర్లుతున్నాయి. మున్నేరు వాగు పెరగడంతో డోర్నకల్ నుంచి గార్ల మండలానికి రాకపోకలు బంద్ అయ్యాయి. ఇక నిర్మల్ కడెం ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో జగిత్యాల జిల్లాలోని ధర్మపురి, రాయపట్నం, కోటిలింగాల వద్ద గోదావరి నీటి మట్టం పెరిగిపోయింది. కామారెడ్డి జిల్లా నిజాం సాగర్ మండలంలోని నల్లవాగు పొంగి ప్రవహిస్తోంది.
ఇక.. ఖమ్మం లోతట్టు ప్రాంతాలైన మయూరి సెంటర్, పాత బస్టాండ్, మోతీ నగర్, పంపింగ్ వెల్ రోడ్, వైఎస్సార్ నగర్, రమణగుట్ట, బీసీ కాలనీల్లో వరద నీరు నిలిచిపోయింది. అశ్వారావు పేట, భద్రాచలం, పినపాక నియోజకవర్గాల్లో ఎడతెరిపి లేని వర్షం కురుస్తోంది. దీంతో చెరువులు, వాగులు, వంకలు అలుగు పోశాయి. అశ్వారావుపేట మండలం వ్యాప్తంగా 26 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది.
అనంతారం, నారాయణపురం, కన్నాయిగూడెం ప్రాంతాల్లోని వాగుల్లో నీరు భారీగానే ప్రవహించింది. జోరు వానకు కిన్నెరసాని, జల్లేరు, కోడెల వాగులు, ఒర్రెలు ప్రవహించాయి. అశ్వాపురం- గొందిగూడెం మధ్య ఇసుక వాగు, తుమ్మల చెరువు- వెంకటాపురం గ్రామాల మధ్య లోతువాగు, రామచంద్రాపురం- సారపాక మధ్య కడియాల బుడ్డివాగు, మొండి కుంట – మల్లెల మడుగు మధ్య రాగం పాపయ్య వాగు, గొల్లగూడెం మేళ్ల వాగులు ఉధృతంగా ప్రవహించాయి. దీంతో వివిధ గ్రామాల మద్య రాకపోకలు నిలిచిపోయాయి.