తెలంగాణ రాష్ట్రంలో ప్రపంచంలోని టాప్ 5 ఐటీ కంపెనీలు తమ రెండవ అతిపెద్ద కేంద్రాన్ని హైదరాబాద్‌లో ఏర్పాటు చేసుకున్నాయని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. హైదరాబాద్ హెచ్‌ఐసీసీలో నాస్కామ్ 12 ఎడిషన్ జీసీసీ కాంక్లేవ్ మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ కొత్త సంస్థలు ఏర్పాటు చేయడానికి హైదరాబాద్ అద్భుతమైన కేంద్రంగా మారిందన్నారు. హైదరాబాద్‌లో ఐటీ గ్రోత్ గణనీయంగా పెరుగుతోందన్నారు. ఇతర సిటీలతో పోలిస్తే హైదరాబాద్‌లో మౌలిక సదుపాయాల కల్పన బాగుందన్నారు. అత్యున్నతమైన బిజినెస్ స్కూల్స్ హైదరాబాద్‌లో ఉన్నాయన్నారు. పరిశ్రమలకు అనువైన పాలసీలను తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిందని వెల్లడిరచారు.
టీహబ్, వీహబ్ ద్వారా స్టార్టప్స్‌కి రాష్ట్ర ప్రభుత్వం చేయూతనిస్తుందని స్పష్టం చేశారు. కొత్త సాంకేతికతను అందిపుచ్చుకోవడానికి ఎమర్జింగ్ టెక్నాలజీ వింగ్ ఏర్పాటు చేశామన్నారు. టాస్క్ ద్వారా డిగ్రీ, ఇంజినీరింగ్ విద్యార్థులకు స్కిల్స్ ఇఫ్రూవ్ చేస్తున్నామని తెలిపారు. టీఎస్ ఐపాస్ ద్వారా పరిశ్రమలకు 15 రోజుల్లో అన్నిరకాల అనుమతులు వస్తున్నాయని అన్నారు. ఎన్నికల టైమ్‌లో కేవలం 6 నెలలు మాత్రమే రాజకీయాలపై దృష్టి పెట్టి మిగతా నాలుగున్నరేళ్లపాటు రాష్ట్ర అభివృద్ధి, ఆర్థికవృద్థి, ఉద్యోగకల్పనపై దృష్టి పెడతామని మంత్రి స్పష్టం చేశారు. గత సంవత్సరం ఐటీ సెక్టార్‌లో లక్షా 50 వేల ఉద్యోగాలు కల్పించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ నగరాలకు చెందిన ఐటీ, ఇతర రంగాలకు చెందిన ప్రముఖులు పాల్గొన్నారు.