తెలంగాణలో సీఎస్ గా పనిచేసి, ఏపీ కేడర్ కి వెళ్లిన సీనియర్ ఐఏఎస్ సోమేశ్ కుమార్ స్వచ్ఛంద పదవీ విమరణ చేసినట్లు తెలుస్తోంది. స్వచ్ఛంద పదవీ విరమణకు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి దరఖాస్తు పెట్టుకోగా… జగన్ దానిని ఆమోదించినట్లు తెలుస్తోంది. బిహార్‌కు చెందిన ఆయన 1989 బ్యాచ్ ఐఏఎస్ అధికారి.. రాష్ట్ర విభజన సమయంలో ఆయనను ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు కేటాయించినా.. సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రైబ్యునల్ (క్యాట్) ఉత్తర్వుల మేరకు తెలంగాణలోనే కొనసాగారు. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సుదీర్ఘ కాలం పని చేశారు.
అయితే క్యాట్ ఉత్తర్వులను డీవోపీటీ తెలంగాణ హైకోర్టులో సవాల్ చేయడంతో హైకోర్టు ఆయనను తక్షణం ఏపీలో రిపోర్టు చేయాలని ఆదేశించింది. దీంతో కొన్ని రోజుల క్రిందటే సోమేశ్ కుమార్ ఏపీ ప్రభుత్వానికి రిపోర్టు చేశారు. తనకు ఏ బాధ్యత అప్పగించినా పనిచేస్తానని, ఓ ఐఏఎస్ అధికారిగా తన ధర్మమని చెప్పుకొచ్చారు. సోమేశ్ కు ఏపీలో ఏ పోస్టు దక్కుతుందా అనే ఆసక్తి రెండు రాష్ట్రాల అధికార వర్గాల్లోనూ కనిపించింది. అయితే… ఏపీ ప్రభుత్వానికి సోమేశ్ రిపోర్టు చేసినా… అక్కడి ప్రభుత్వం ఆయనకు ఏ పోస్టూ కేటాయించలేదు. సోమేశ్ కుమార్ సీనియార్టీకి తగినట్టుగా ఏపీ ప్రభుత్వంలో ఏ పోస్టూ ఖాళీ లేదు. దీంతో చేసేదేమీ లేక సోమేశ్ కుమార్ స్వచ్ఛంద పదవీ విరమణ చేసినట్లు సమాచారం.