ముస్లింలు పవిత్ర మాసంగా ఆచరించే రంజాన్ పండుగను పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏటా అధికారికంగా నిర్వహించే ఇఫ్తార్ విందును ఈ నెల 12వ తేదీ సాయంత్రం ఎల్ బి స్టేడియంలో నిర్వహించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. ఈ మేరకు సంబంధిత ఏర్పాట్లు చూడాల్సిందిగా తన కార్యదర్శి భూపాల్ రెడ్డిని, సిఎం గారు ఆదేశించారు.యేటా నిర్వహించే ఇఫ్తార్‌కు సీఎం స్వయంగా వేడుకల్లో పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేయడంతో పాటు రంజాన్ శుభాకాంక్షలను తెలుపుతారు. పేద ముస్లింలకు రంజాన్ తోఫా అందజేస్తారు. ఇదిలా ఉండగా గతేడాది మాదిరిగానే ఈసారి కూడా రాష్ట్రవ్యాప్తంగా 4.5 లక్షల మంది నిరుపేద ముస్లింలకు గిఫ్ట్ ప్యాక్ లు పంపిణీ చేయనున్నారు. ఒక్కో కమిటీకి 500 చొప్పున రాష్ట్రవ్యాప్తంగా 815 మసీదు మేనేజింగ్ కమిటీలకు ఇప్పటికే గిఫ్ట్ ప్యాకెట్లను సరఫరా చేశారు. ఈ ఇఫ్తార్ విందును రాష్ట్ర ప్రభుత్వం భారీ స్థాయిలో నిర్వహించనుంది. ఈ ఇఫ్తార్ విందులో ముస్లిం మతపెద్దలు, ఎమ్మెల్యేలు, ప్రభుత్వ అధికారులు, సామాన్య ప్రజలు చేరనున్నారు.