చైనా, పాకిస్తాన్ కు భారత్ గట్టి ఝలక్ ఇచ్చింది. పీఓకే గుండా వెళ్తున్న పాక్- చైనా ఎకనామిక్ కారిడార్ లో మూడో దేశాన్ని తీసుకురావాలని చైనా ప్రయత్నాలు ప్రారంభించింది. ఈ విషయంపై భారత విదేశాంగ శాఖ రియాక్ట్ అయ్యింది. సీపెక్ కింద ఇలాంటి కార్యకలాపాలు చట్ట విరుద్ధమని, ఆమోదయోగ్యం కాదనని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చీ ఇరు దేశాలకు తేల్చి చెప్పారు. ఏ దేశమైనా ఇందులో చేరితే, భారత దేశ సార్వభౌమాధికారాన్ని, ప్రాదేశిక సమగ్రతను ధిక్కరించినట్లే అవుతుందని బాగ్చీ హెచ్చరించారు. ఈ ప్రాజెక్టును భారత ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తోందని కూడా తేల్చి చెప్పారు.
భారత భూభాగంలో చైనా, పాకిస్తాన్ సీపెక్ ప్రాజెక్టును నిర్మిస్తున్నాయి. ఇందులోకి మూడో దేశాన్ని ఆహ్వానించాలని చైనా నిర్ణయించుకుంది. చైనా నుంచి భారీగా అప్పులు తీసుకొని, పాక్ సీపెక్ ద్వారా రోడ్డు, రైలు నిర్మాణాలు చేస్తోంది. చైనాలోని జిన్ జియాంగ్ ప్రావిన్స్ నుంచి పీఓకేలోని బెలూచిస్తాన్ గ్వాదర్ పోర్టు వరకూ ఈ నిర్మాణాలు కొనసాగుతున్నాయి. ఇక.. ఈ నిర్మాణాలపై బెలూచిస్తాన్ ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తోంది.