పాకిస్తాన్ పై యూఎన్ లోని భారత రాయబారి రుచిర కాంబోజ్ తీవ్రంగా విరుచుకుపడ్డారు. ఐక్యరాజ్య సమితిలో పాక్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో చేసిన వ్యాఖ్యలపై స్పందించడం కూడా వ్యర్థమన్నారు. ఆయన వ్యాఖ్యలకు ఎలాంటి విలువా లేదని, అయినా… వాటిని ఖండిస్తున్నామని అన్నారు. ఆయనవి తప్పుడు ఆరోపణలు అని, నిరాధారమైనవని కూడా అన్నారు. ప్రపంచవ్యాప్తంగా మహిళలకు భద్రత, శాంతియుత పరిస్థితులు అనే అంశంపై మనం ఈరోజు చర్చ జరుపుతున్నామని, చర్చను మేము గౌరవిస్తున్నామన్నారు.
అయితే దీనిపై చర్చించడానికి బదులుగా పాక్ ప్రతినిధులు పనికిమాలిన, నిరాధార, రాజకీయ ప్రేరేపిత వ్యాఖ్యలు చేస్తున్నారని విరుచుకుపడ్డారు. కశ్మీర్ అంశాన్ని అంతర్జాతీయ వేదకలపై ప్రస్తావించడం, భారత్ ప్రతిఘటన చవిచూడటం ఇది మొదటిసారి కూడా కాదు. జమ్మూకశ్మీర్, లద్దాఖ్ భారత్‌లో అంతర్భాగమని, ఎప్పటికీ భారత్‌లోనే ఉంటాయని, వాటిపై ఎవరి జోక్యం అవసరం లేదని భారత్ పలుమార్లు దాయాది దేశానికి తేల్చిచెప్పింది. అయినా సరే… పాకిస్తాన్ నిస్సిగ్గుగా పదే పదే అసందర్భంగానూ కశ్మీర్ అంశాన్ని ప్రస్తావిస్తోంది.