దేశంలో హఠాత్తుగా ఎన్నికలు వస్తే ఏ పార్టీ గెలుస్తుంది? తదుపరి ప్రధాని ఎవరు? అన్న ఉత్కంఠత అందరిలోనూ వుంటుంది. దీనిపై ఇండియా టీవీ వాయిస్ ఆఫ్ ది నేషన్ పేరిట దేశంలో ఒపీనియన్ పోల్ నిర్వహించింది. ఇప్పటికిప్పుడు లోక్ సభకు ఎన్నికలంటూ జరిగితే.. మళ్లీ ప్రధాని మోదీ సారథ్యంలోని ఎన్డీయేనే విజయ దుందుభి మోగిస్తుందని ఈ సర్వే ప్రకటించింది. ఎన్డీయే కు 41 శాతం, సోనియా సారథ్యంలోని యూపీఏ 28 శాతం, ఇతరులకు 31 శాతం ఓట్లు వచ్చే ఛాన్స్ వుందని ఒపీనియన్ పోల్స్ పేర్కొంది. ఇక.. దేశంలో 543 లోక్ సభ స్థానాలుండగా… ఎన్డీయే 362 స్థానాల్లో భారీ మెజారిటీతో విజయం సాధిస్తుందని తెలిపింది. ఇక.. యూపీఏకి 97 లోకసభ సీట్లు మాత్రమే సాధిస్తుంది. ఇక… చిన్న ప్రాంతీయ పార్టీలు, స్వతంత్రులు 84 సీట్లలో విజయం సాధిస్తారని సర్వే తెలిపింది.
తెలంగాణలోని 17 సీట్లలో ఎన్డీయేకు 6, యూపీఏకు 2, టీఆర్ఎస్ తో సహా ఇతరులకు 9 సీట్లు వస్తాయని ఈ పోల్ అంచనా వేసింది. ఇక… ఏపీలో అన్ని సీట్లలోనూ (25) వైసీపీ విజయం సాధిస్తుందని సర్వే తెలిపింది. ఇక… మినీ భారత్ గా పిలవబడే యూపీలో 80 సీట్లకు ఎన్డీయే 76 సీట్లను తన ఖాతాలో వేసుకుంటుందని సర్వే తెలుపుతోంది. యూపీఏ, ఇతరులు మిగిలిన సీట్లలో గెలుస్తారని తెలిపింది. ఇక మహారాష్ట్రలో 48 సీట్లలో 37 స్థానాల్లో ఎన్డీయే, మిగతా 11 స్థానాల్లో ఇతరులని తేల్చింది. ఇక.. తమిళనాడులో డీఎంకే 39 స్థానాలకు గాను 38 సీట్లు, బీజేపీకి ఒక్కటే స్థానం దక్కుతుందని సర్వే తేల్చింది. బిహార్ లో 40 స్థానాలకు గాను 37 ఎన్డీయే, మిగతా 5 సీట్లలో ఇతరులు గెలిచే అవకాశాలున్నాయి.