సీఎం నితీశ్ కుమార్ ఎన్డీయేతో తెగదెంపులు చేసుకున్నారు. దీంతో బీజేపీకి రాజ్యసభలో బలం తగ్గింది. అలాగే రాజకీయంగా కూడా బీజేపీలో చిక్కుల్లో పడిందని వార్తలొచ్చాయి. అయితే… నితీశ్ కుమార్ హ్యాండిచ్చినా…. ఎన్డీయేకి వచ్చే నష్టమేమీ లేదని ఇండియా టుడే సర్వేలో తేలిపోయింది. నితీశ్ కుమార్ ఎన్డీయేకి గుడ్ బై చెప్పేసినా… దేశంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు వచ్చినా… మళ్లీ మోదీయే ప్రధాని అవుతారని, ఎన్డీయేనే అధికారంలోకి వస్తుందని ఈ సర్వేలో వెల్లడైంది. అయితే.. గతంలో కంటే ఈసారి ఎన్డీయేకు సీట్లు తగ్గుతాయని మాత్రం ఈ సర్వే తేల్చి చెప్పింది.
ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే మొత్తం 543 లోక్‌సభ నియోజకవర్గాల్లో 286 స్థానాల్లో ఎన్డీయే గెలిచే అవకాశం ఉందని ఇండియా టుడే మ్యాగజైన్ నిర్వహించిన ఈ సర్వే వెల్లడించింది. ఎన్డీయే నుంచి బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ నేతృత్వంలోని జేడీయూ వైదొలగినందువల్ల దాదాపు 21 స్థానాలను ఎన్డీయే కోల్పోయే అవకాశం ఉందని అంచనా వేసింది. అంతకుముందు ఇదే మ్యాగజైన్ నిర్వహించిన సర్వేలో ఎన్డీయే కూటమికి 307 స్థానాలు లభిస్తాయని అంచనా వేసిన సంగతి తెలిసిందే. ఈ సర్వేలను సీ-ఓటర్ అనే సంస్థతో కలిసి నిర్వహించారు.